పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/106

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుధన్వునికథ.

93

కల్యాణీ! నేనుభూలోకచక్రవర్తియగు తాళధ్వజుని రెండవకుమారుండ నాపేరు సుధన్వుండందురు. నేనుమాయన్నతోఁగూడ దిగ్విజయయాత్రకు బయలుదేరి పెక్కండ్రరాజులజయించియింటికిఁబోవుచు నొకనాఁడొక కొండప్రక్క విడిసితిమి. అందొకమహర్షితపంబొనరించుచుండుటందెలిసి మాయన్నగారాయన దర్శనార్ధమైయరిగి తత్ప్రేరణంబున నాశైలమెక్కియేమయ్యెనో తిరుగానాకడకు రాలేదు. ఆదివసమెల్ల వానినిమిత్తమెదురుచూచుచుంటిమి మఱునాటికినిరాలేదు. అమ్మఱునాఁడు సాయంకాలమ నేనాఋషియొద్దకుబోయి మాయన్నయేమయ్యెననియడిగితిని. కొండశిఖరముమీఁద నున్నాఁడని అందలివింతలతని రానిచ్చినవికావు కాబోలు నేఁడుకూడనిలిచెను. ఈసాయంకాలమునకు రాఁగలడు ఇచ్ఛఁగలదేని నీవుగూడఁబోయి చూడవచ్చును. మా శిష్యుఁడు దారిఁజూపగలడని యుపదేశించిన వానిమాటనిజమనుకొని కొండయెక్కి గుహలో జొరఁబడి యందున్న బల్లపైఁగాలుమోపితినో లేదో తటాలున నొకగోతిలోఁబడి శరవేగముగా జారఁదొడంగితిని. కొంతసేపటికి నాకు స్మృతిదప్పినది. పిమ్మట నేమిజరిగినదియోనాకుఁ దెలియదు. తరువాతకథ నీవే చెప్పవలయునని యడిగిన నాపడతి యిట్లనియె.

ఓహో! నీవు రాజకుమారుఁడవా! మంచియాపదలోనే చిక్కుకొంటివి. వినుము. ఈలోకము ఆతలము వజ్రకంఠుఁడను దానవుడు దీనింబాలించుచున్నవాఁడు. ఇందున్నవారందరు దయాసత్య శౌచములులేని రాక్షషులు నీవువధ్యశిలపైబడినతోడనే కూరలతట్టలోఁ బడవలసినదే. ఆయుశ్శేష ముండఁబట్టియింకను బ్రతికియుంటివి. నరాంతకునిభార్య సీమంతోత్సవమునాఁడు నిన్ను విశసింతురు. అందులకై నీకీయాహారమిడుచున్నవారని యారహస్యములన్ని యు నెఱింగించినది.

ఆకథవినినతోడనే వానికాహారము నోటికిఁబోయినదికాదు.