పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/105

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

కాశీమజిలీకథలు - పదియవభాగము.

బందీగృహమువంటి యింటిలోనుండి తనవృత్తాంతమునుగుఱించియే వితర్కించుచుండెను.

వానికి నిత్యము నాహారమిడుటకు నరాంతకుని మేనకోడలు రత్నావతియను చిన్న దానిని నియమించిరి. రత్నావతి మిక్కిలి చక్కనిది. అచ్చరకన్యక, నరాంతకుని బావమఱఁది వజ్రకంఠునితోఁ గూడ నొకప్పుడు నాకముపై దండెత్తినప్పుడుపోయి యందొకయచ్చరను జెఱబట్టి తెచ్చెను. రత్నావతి ఆయచ్చరకుఁ జనించినదగుటఁ బద్మసేనవలెనే రాక్షసస్త్రీలంబోలక దేవతాకన్యలం బోలియున్నది.

రత్నావతి రెండవనాఁ డాహారము దీసికొనిపోయి యాపురుషుని యాకారముజూచి మోహపరవశయై పరిశీలించి అయ్యో! దివ్యమంగళవిగ్రహముగలయట్టి పురుషునికిఁక వారముదినములలోమరణము విధింపఁబడియున్నది. వీనింజంపక నాకువివాహముజేసిన సంతసింతును గదా!దీర్ఘ జిహ్వునికొడుకు హ్రస్వపాదునకు నన్నిచ్చి పెండ్లిచేయుదురఁట వానితోనేనెట్లుకాపురముచేయుదును? వీనింజూచిన జాలిగలుగు చున్నది కానిమ్ము. నాకుఁ దోచినసహాయముజేసి రక్షించెదఁగాక అని యాలోచించుచు నాహారముదీసికొని యొకపాత్రలోఁబెట్టి వాని ముందరకుఁ ద్రోసియందునిలువంబడినది, అపురుషుడాచిన్న దానిమొగంబుజూచి వెఱఁగుపడుచునదియేదేశమోనేనిక్కడికెట్లువచ్చితినో ఈమె నడిగి తెలిసికొనియెదంగాక అని యాలోచించి కల్యాణీ! ఇదియేదేశము నీ వెవ్వనిపుత్రికవు నీ మొగంబుజూడఁ గరుణారస మొలుకుచున్నది. నన్నిట్లు మీరేమిటికిఁ బోషించుచున్నారని యడిగిన నాచేడియ వానికిట్లనియె.

ఆర్యా! నీవీదేశము పేరు తెలియకిక్కడకెట్లువచ్చితివి? నీమాటలు విపరీతముఁగానున్నవి. నన్నుఁ బల్కరించునెపంబున నిట్లంటివనిత లంచితిని నీకథనీవేముందుఁ జెప్పవలయునని యడిగిన నాతండిట్లనియె.