ఈ పుట ఆమోదించబడ్డది

కాలజ్ఞానము. భవిష్యత్తు అనినా కాలజ్ఞానమనినా రెండు ఒకటే అయినా చూచి చెప్పునది జ్యోతిష్యము. చూడక చెప్పునది కాలజ్ఞానము. దేనినీ చూడకుండా చెప్పిన వారిలో మనకు తెలిసినంతవరకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు కలడు. తాము జ్యోతిష్యులమని ప్రకటించుకోని వారిలో రెండవ రకమునకు చెందిన జ్యోతిష్యులుండవచ్చును.

పూర్వకాలములో రెండవరకము జ్యోతిష్యులు అప్పుడప్పుడు కొందరున్నట్లు వినికిడి. అటువంటి వారిలో ముఖ్యుడు త్రేతాయుగమున గల రావణబ్రహ్మ. గత కొంతకాలము క్రింద ఉదాహరణగా చెప్పుకొనుటకు వీరబ్రహ్మముగారు కనిపిస్తున్నారు. రావణబ్రహ్మ కాలజ్ఞానమును పూర్తిగా తెలిసిన త్రికాల జ్ఞాని. రావణబ్రహ్మ త్రికాలజ్ఞాని అని పేరుగాంచితే, వీరబ్రహ్మము కాలజ్ఞాని అని పేరుగాంచియున్నారు. రావణబ్రహ్మ మూడు కాలములకు జ్ఞానియై నేటికినీ త్రికాలజ్ఞానిగా పేరుగాంచియున్నాడు. వీరబ్రహ్మము భవిష్యత్‌ కాలమునకు జ్ఞానియై కాలజ్ఞానియని పేరుగాంచి యున్నాడు. వీరు ఇద్దరూ మనకు నమూనాకు చెప్పబడే రెండవరక జ్యోతిష్యులని తెలియుచున్నది. పూర్వము పెద్దలైనవారు రెండవ రక కనిపించని జ్యోతిష్యులుగా ఉంటే, నేడు మొదటి రక జ్యోతిష్యమును కూడా సరిగా తెలిసినవారు లేకుండా పోవడము మనకే అవమానము. అందువలన మొదటి రక జ్యోతిష్యులు ఒకరిద్దరుండినా ఫరవాలేదు. వారు సక్రమమైన జ్యోతిష్యము తెలిసియుండాలి అను ఉద్దేశ్యముతో ఇప్పుడు పన్నెండు గ్రహములతో కూడుకొన్న జ్యోతిష్యశాస్త్రమును వ్రాయడము జరిగినది.