ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరము పంచాంగము విడుదలయైన వెంటనే దానిలోని పన్నెండు నెలలు వెదకి చూడాలి. గ్రహచారములో ఎక్కువ శత్రు గ్రహములు ఒకచోట చేరినా, చేరిన శత్రు గ్రహములు ఆయు స్థానమును తాకినా, ఆయువుకు అధిపతియైన శని గ్రహమును బంధించినా అష్టమాధిపతియైనవాడు శత్రుగ్రహముల చేతిలో చిక్కుకొనినా అది ప్రమాద సమయమని గుర్తించుకోవచ్చును.

ఎంతో తెలివిని ఉపయోగించి ఒక వ్యక్తి జాతకములోనున్న ప్రమాదమును 32వ సంవత్సర పంచాంగములో గుర్తించావనుకొనుము. ఆ సంవత్సరము ఉగాది మొదటిలో వచ్చిన పంచాంగమును చూచి ఈ సంవత్సరము ఏడు నెలలు గడచిన తర్వాత ఎనిమిదవ నెలలో ప్రమాదము జరిగి జాతకుడు మరణించునని తెలిసినదనుకొనుము. అప్పుడు ఆ జాతకుడు గానీ, ఆ జాతకునికి ప్రమాదమును గురించి తెలిపిన జ్యోతిష్యుడుగానీ ఏ ప్రయత్నము చేసినా, ఏ శాంతులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఎంతోమంది దేవతలను ఆరాధించి మ్రొక్కుబడులు చెల్లించినా, శాంతి హోమములు, మృత్యుంజయ యజ్ఞములు చేసినా, జ్యోతిష్యుడు తన విద్యనంతా ఉపయోగించి జాతకున్ని ప్రమాదమునుండి కాపాడవలెననుకొనినా, జాతకుడు తన ధనమును ఉపయోగించి శనీశ్వరు నికి బంగారు కిరీటము చేయించినా, విఘ్నేశ్వరునికి గుడికట్టించినా, ముక్కంటీశ్వరునికి ముడుపులు చెల్లించినా, కపిలేశ్వరునికి తైలాభిషేకము, నీలకంఠేశ్వరునికి రుద్రాభిషేకము చేయించినా రానున్న ముప్పు రాక మానదు. జరుగవలసిన ప్రమాదము జరుగకమానదు. ఎవ్వరుగానీ కర్మను అతిక్రమించి పోలేరు. ఏ క్రియలచేతగానీ జరుగవలసిన కర్మను తప్పించు కోలేరు. గ్రహచారములో ఎవరూ ఏమీ చేయలేరు. అది ఎట్లుంటే అట్లు జరిగితీరును.