ఈ పుట ఆమోదించబడ్డది

అందువలన కర్మము మర్మమైనదని పెద్దలన్నారు. కార్యము కనిపించి ప్రత్యక్షమైనదైతే, కర్మ కనిపించక పరోక్షమైనదనీ, దానిని తెలుసుకోవడమే మనిషికి ఆధ్యాత్మికములో ముఖ్యమైనదని తెలియాలి.

8. కర్మ ఎన్ని రకములు?

కర్మ విధానమును బాగా ఆధ్యాయనము చేస్తే, మనిషి పుట్టినప్పటి నుండి ఒకటి సంపాదించే కర్మ, రెండు అనుభవించేకర్మ అని రెండు రకములు గలవు. ఇవి రెండూకాక సంపాదించేది ఎక్కువై, అనుభవించేది తక్కువైనపుడు శేషముగా (బ్యాలెన్సుగా) మిగిలే కర్మ కొంతవుంటుంది. అలా మిగిలిన శేషము యొక్క నిల్వను ‘సంచితకర్మ’ అని అంటున్నాము. ఒక జన్మలో సంపాదించిన కర్మను ‘ఆగామికర్మ’ అని అంటున్నాము. అట్లే ఒక జన్మలో అనుభవించే కర్మను ‘ప్రారబ్ధకర్మ’ అని అంటున్నాము. బ్రహ్మవిద్యా శాస్త్రము ఆగామికర్మ యొక్క వివరమును తెలియజేయును. జ్యోతిష్యశాస్త్రము ప్రారబ్ధకర్మ యొక్క వివరమును తెలియజేయును. ఆగామికర్మను సంపాదించుకోకుండా ఉండే వివరమును తెలుపునది ‘బ్రహ్మవిద్యాశాస్త్రము’. అలాగే ప్రారబ్ధకర్మలోని అనుభవములను వివరించి తెల్పునది ‘జ్యోతిష్య శాస్త్రము’. ఇపుడు మనము జ్యోతిష్యమునకు సంబంధించిన ప్రారబ్ధమును గురించి తెలుసుకొందాము.

ప్రారబ్ధకర్మ ఎలా పుట్టుచున్నదో అని చూస్తే, పొగ పుట్టుటకు నిప్పుకారణమన్నట్లు, ప్రారబ్ధకర్మ పుట్టుటకు మనిషి తలలోని గుణములు కారణము. తల మధ్యలోగల నాల్గుచక్రముల సముదాయములో, క్రిందనున్న చక్రము పేరు గుణచక్రము. గుణచక్రము మూడు భాగములుగా విభజింపబడి