ఈ పుట ఆమోదించబడ్డది

సముదాయము విశ్వములోని జీవులందరికీ ఆధారమైయున్నది. ఈ నాల్గుచక్రముల సముదాయము తెలియకపోతే మనిషికి దైవజ్ఞానము ఏమాత్రము తెలియదని చెప్పవచ్చును. నాల్గుచక్రములు అటు బ్రహ్మవిద్య లోనూ (ఆధ్యాత్మిక విద్యలోనూ), ఇటు జ్యోతిష్యశాస్త్రములోనూ ప్రాధాన్యత కల్గియున్నవి. ఈ నాల్గుచక్రముల వివరము కూలంకషముగా తెలియాలంటే త్రైతసిద్ధాంత భగవద్గీతలోని, అక్షర పరబ్రహ్మయోగమను అధ్యాయమును చదవండి. అక్కడే మన శరీరములోని నాల్గుచక్రముల వివరము తెలియగలదు. ఈ నాల్గుచక్రముల వివరము తెలియక పోయిన దానివలన, ఇటు బ్రహ్మవిద్యాశాస్త్రమైన ఆధ్యాత్మికములోనూ, అటు కర్మ విధానమైన జ్యోతిష్యరంగములోనూ మనుషులు వెనుకబడిపోయి యున్నారు. నాల్గు చక్రములంటే ఏమిటి? అవి ఎక్కడున్నవి? అని తెలియనంత వరకు సంపూర్ణమైన దైవ జ్ఞానమునుగానీ, సంపూర్ణమైన జ్యోతిష్యమునుగానీ తెలియలేము. కళ్ళు లేనివానికి దృష్ఠి ఏమాత్రములేనట్లు, బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల వివరము తెలియని వానికి జ్ఞానదృష్ఠి ఏమాత్రముండదు. ప్రతి శరీరములో నుదుటి భాగమున లోపల గల నాల్గుచక్రముల సముదాయమును తర్వాత పేజీలోని 2వ చిత్రపటమునందు చూడవచ్చును.

పై నుండి రెండవ చక్రమే కాలచక్రము. కాలచక్రము గుండ్రముగా వుండి పండ్రెండు భాగములు కల్గియుండగా, కొందరు జ్యోతిష్యులు దానికి ‘జాతకచక్రమనీ’ లేక ‘జాతకకుండలియనీ’ పేరుపెట్టి చతురస్రముగ చిత్రించు కొన్నారు. దానికి ‘లగ్నకుండలియని’ పేరుకూడా పెట్టారు. లగ్నకుండలి, జాతకకుండలి, జాతకచక్రము అనబడు కాలచక్రము యొక్క చతురస్రముగా నున్న చిత్రమును తర్వాత పేజీలోని 3వ చిత్రపటమునందు చూడవచ్చును.