ఈ పుట ఆమోదించబడ్డది

కల్గియున్నవని తెలియుచున్నది. ఒక వ్యక్తికున్న పుత్రుడు మంచివాడా, కాదా? తండ్రి మాట వింటాడా, వినడా అను ప్రశ్నలకు పుత్రునికి అధికారి అయిన గురుగ్రహమును చూచి, గురుగ్రహము అనుకూలమైనదైతే పుత్రుడు అనుకూలముగా ఉండుననీ గురుగ్రహము శత్రువుగాయుంటే అతని పుత్రుడు కూడా మాట వినడని చెప్పవచ్చును. గురుగ్రహము ఉన్న స్థానమునుబట్టి వ్యతిరేఖత ఎంత అను దానిని గానీ, అనుకూలత ఎంత అను దానినిగానీ నిర్ణయించవచ్చును. అదే విధముగా జ్ఞాన విషయము లోనికివస్తే జ్ఞానము కర్మకు అతీతమైనది కదా! అటువంటపుడు కేతు గ్రహము జ్ఞానమునకు ఎలా అధిపతిగా ఉన్నదని కొందరికి ప్రశ్న రావచ్చును. దానికి మా జవాబు ఏమనగా! జ్ఞానము కర్మకు అతీతమైనదే, అది మనిషి శ్రద్ధనుబట్టి లభ్యమగును. ఇక్కడ కేతువును చూపడము దేనికంటే మనిషి శ్రద్ధ ఏ జ్ఞానమువైపు ఉన్నదో తెలుయుటకు మాత్రమే. కేతువు అనుకూలమైన గ్రహమైతే ఆ వ్యక్తి అసలైన దేవతారాధన కాని జ్ఞానము వైపు నడచుననీ, అనుకూలమైన గ్రహము కాకపోతే అతని శ్రద్ధ అసలైన నిరాకార దేవుని వైపు కాకుండా, దేవతలవైపు ఉండుననీ తెలియుటకు మాత్రమేనని తెలియ వలెను. జ్ఞానము మనిషి శ్రద్ధనుబట్టియే వచ్చునుగానీ గ్రహ బలమును బట్టి రాదు. అందువలన జ్ఞానము కర్మకు అతీతమైనదనియే చెప్పుచున్నాము. ఇకపోతే మనిషికి ఎటువంటి శ్రద్ధయున్నదో కేతువునుబట్టి తెలిసినా, వాని శ్రద్ధ ప్రకారము ఏకైక దేవుని మీదగానీ, సామూహిక దేవతలపైనగానీ కల్గు జ్ఞానము ఆటంకములు లేకుండా తెలియునా, ఆటంకములతో తెలియునా అను విషయము అజ్ఞానమునకు అధిపతిగా సూచించిన భూమిని బట్టి తెలియును. అంతేగానీ భూగ్రహము అనుకూలముగా లేనియెడల జ్ఞానము తెలియదని చెప్పుటకు వీలులేదు. జ్ఞానమార్గములో ఆటంకములను