ఈ పుట ఆమోదించబడ్డది

సూక్ష్మజీవులు

సూక్ష్మజీవులయొక్క మృదురోమముగూడ సూక్ష్మజీవుల మూలపదార్థముయొక్క శాఖయే. అయినను వికారిణి పాదమునకును దీనికిని కొన్ని భేదములు గలవు.

1. ఈ మృదురోమము వికారిణిపాదమువలె దళముగగాక మిక్కిలి సన్నముగను సున్నితముగను ఉండును. ఇది సూక్ష్మజీవి నంటియుండు భాగమున అనగా మొదట కొంచెము లావుగనుండి క్రమముగ కొనవైపునకు సన్నగించిపోవును; ఈరూపము మారక స్థిరముగనుండును. వికారిణి పాదము అనేక రూపములు దాల్చవచ్చును. అది యొకప్పుడు పొట్టిగను, మరియొకప్పుడు పొడుగుగను, ఒకప్పుడు వంకరగును, మరియొకప్పుడు తిన్నగను ఉండును.

2. వికారిణి తనపాదముల నన్నిటిని ముడుచుకొని ఒక్కచోట మిక్కిలి పొడుగైన సన్ననిపాదము నొక దానిని చాచినదని మనము భావించినయెడల అది మృదురోమమును బోలియుండునని చెప్పవచ్చును. వికారిణియొక్క పాదము దానియం దేభాగమున గలిగినను గలుగును. మృదురోమము సూక్ష్మజీవులందు ఇచ్చవచ్చినచోట్ల కలుగక నియతముగా వానికొనలయందు మాత్రము కలుగును.

3. ఇంతేకాక, వికారిణియొక్క పాదము నొక దానిని తెగగొట్టినయెడల దాని నేమియు వికారిణి లెక్కచేయదు. మరియొక పాదమును దానికి బదులుగా నిర్మించుకొని తనవ్యాపారము