ఈ పుట ఆమోదించబడ్డది

రూలుకర్ర ముక్కలున్నట్లుండును (సూ. దం. చూడుము). ఇవియే అన్నిటికంటె తరుచుగనుండుజాతి. వీనికి చలరూపమును అచలరూపమును గూడ గలవు. చలించువాని రెండుకొనలను రెండుమృదురోమము లుండును. తెట్టెకట్టుగుణము వీనికిని గలదు. ఈతెట్టెయందు సూక్ష్మదండిక లొక దానికొన కొకటి అంటుకొని పొడుగైన దారములవలె కనబడును. క్షయవ్యాధిని, పశువుల దొమ్మవ్యాధిని గలిగించు సూక్ష్మజీవులు ఈసూక్ష్మదండిక జాతిలోనివి (7-వ పటము చూడుము).

సూక్ష్మకంపక (Vibrio-విబ్రియో).

ఇవి సూక్ష్మదండికలవలెనే యుండునుగాని యీ కణికెలు తిన్నగా నుండక కొంచెము మెలితిరిగి యుండును (సూ. కం). ఇవి మిక్కిలి చురుకుగా పరుగు లెత్తుచుండును. మంచి సూక్ష్మదర్శనులతో చూచునెడల కలరా అనగా వాంతిభేదిని గలిగించునది సూక్ష్మకంపకల జాతిలోనిదే. (7-వ పటములో "క" చూడుము).

సూక్ష్మవ్యావర్తక (Spirillum-స్పైరెల్లము).

ఇది మరమేకు చుట్లవలె మెలికలుతిరిగి యుండును. ఇట్టి రూపమును చూచువెంటనే సూక్ష్మవ్యావర్తకను గుర్తింపవచ్చును (సూ. వ్యా). సూక్ష్మవ్యావర్తక ఈతకొట్టునప్పుడు చూపునకు మిక్కిలివడిగా మెలికలు తిరుగుచు పోవు పామువలె కనిపించును.