ఈ పుట ఆమోదించబడ్డది

మొదలయిన శాస్త్రములన్నియు జీవశాస్త్రమును సంబంధించినవియే. ఐనను సమస్త జీవకోట్లకును సర్వసామాన్యమైన విషయములను మాత్రము బోధించు భాగమునకు సంకేతముగా జీవశాస్త్రమను పదము ప్రయోగింపబడుచున్నది. జీవకోట్లు జంతువులుగా గాని వృక్షములుగా గాని ఏర్పడియున్నవి. కాననీశాస్త్రము జంతుసముదాయమునకును వృక్షసముదాయమునకును గల సామాన్య స్వభావములను, పరస్పర తారతమ్యములను బోధించు భాగముగా నేర్పడుచున్నది. జంతు సముదాయమునుగూర్చి బోధించు భాగము జంతుశాస్త్రము (Zoology) వృక్షసముదాయమునుగూర్చి బోధించుభాగము వృక్షశాస్త్రము (Botany). ఇప్పు డీ గ్రంథమునందు జంతుజాతి జీవులు కొన్నియును, వృక్షజాతిజీవులు కొన్నియును వాని తరగతులను బట్టి క్రమముగా నొకదానిప్రక్క నొకటి వర్ణింపబడుచు, ఆయాతరగతులకు గల సామాన్య గుణములును, వ్యత్యాసములును సూచింపబడును.