ఈ పుట ఆమోదించబడ్డది

ఇవియన్నియు స్వజాతిని పెంపొందించు నిమిత్తమై వృక్షములు జేసికొనుప్రయత్నము లని తోచక మానదు.

ప్రకృతిసిద్ధ మైన జగడము.

సృష్టియందు ఏ పదార్థములకు హెచ్చు సుగుణములు గలవో ఆ యా పదార్థములు తక్కిన పదార్థములకంటె నెక్కువకాలము వర్ధిల్లును. ఏది తగినన్నిసుగుణములు లేనిదో అది యొక తరమునగాకపోయిన మరియొక తరముననైన, లేక మరిరెండు తరములలోనైన, పదితరములలోనైన, నూరుతరములలోనైన నిర్వంశమై పోవును. సుగుణములుగల జీవులయొక్క సంతతి ఒక్కొకతరముకంటె మరియొక తరమునందు హెచ్చు సుగుణములను గలిగియుండును. దుర్గుణములుగల జాతులయొక్క సంతతి దుర్గుణములందే హెచ్చు చుండును. తుదకు సృష్టియందు పిపీలికాది బ్రహ్మపర్యంతముండు ప్రాణకోటిలో అనగా వికారిణి మొదలు మానవునివరకు నుండు జంతువులయందును, సూక్ష్మజీవులు మొదలు చింతచెట్టువరకునుండు వృక్షములయందును, ఒండొరుల ఆహారమునకై జరుగు పెద్దజగడము (Struggle), లో, ఏ యే జీవులకు హెచ్చు సుగుణములుగలవో ఆయా జీవులు గెలిచి, తమ సద్గుణములను నిలుపుకొనును. ఇట్టి ప్రకృతిసిద్ధమైన జగడములో ఏజీవు లోడిపోవునో ఆజీవులు కొన్నితరములలో నశించును. ఎట్లన మంచివికాని విత్తనములతో నారుపోసిన ఆవిత్తనములలో కొన్ని మాత్రమే మొలచును. కొన్ని మొలచినను చక్కగ పెరుగక గిటకబారిపోవును. ఇట్లు గిటకబారినమొక్కల