ఈ పుట ఆమోదించబడ్డది

కొంతవరకును, స్వీకరించునది కనుక, దానియందు ఆయావ్యాపారములను జేయునిమిత్తమై కొన్నికొన్ని కణములు నియతముగ నేర్పడియున్నవి. ఈకణములలో వానివాని వ్యాపారములనుబట్టి వాని నిర్మాణములుగూడ మారుట జూచియుంటిమి. ఎట్లన, బురదనుండి ఆహారమును గొను మూలతంతువుల కణములందు హరితకములులేవు. ఈ కణములకు సూర్యకాంతితో బనిలేదు. వారిపర్ణిని నిలబడునట్లు జేయుటకును, దానికి కొంతవరకు ఆహారము నమర్చుటకును కాడ యుపయోగపడుచున్నది. వారిపర్ణి కాహారము స్వీకరించిపెట్టుటకు ముఖ్యముగా నేర్పడియున్న ఆకులయందు హరితకములు పెక్కులు గలవు. కాడయం దీ హరితకములు వెలుపలివైపునమాత్రము స్పల్పముగ గలవు.

వారిపర్ణితరువాత మనము జదివిన నాచుమొక్కగూడ కణములపేర్పుచే నిర్మితమైన స్రంభమువంటిదియే. ఇది నీటిలో మునిగియుండి, తన యాహారమును అందుండిమాత్రమే తీసికొనక కొంచెము నీటిపైకి తలయెత్తి గాలినుండిగూడ కొంతయాహారమును గ్రహించును. దానియాకుల నెల్లప్పుడు నీటిపై నుండునట్లు జేయుటకై దానికొమ్మలు కొంచెము దృఢముగా నుండవలసియున్నది. అట్టివ్యాపారము నెరవేర్చుటకై దానికొమ్మయొక్క వెలుపలివైపున చుట్టునుండుకణములు పొడుగుగనెదిగి బలమైనవిగ నున్నవి. వీని కణకవచములు దళసరెక్కి గట్టిపడియున్నవి. ఇవి గట్టిగనుండుటచే తమ లోపలితట్టుననుండు కణములలోనిపదార్థములు వ్యర్థముగ వెలుపలికిబోకుండ ఆపుటయేకాక, మొక్కకు దృఢత్వముకూడ నిచ్చుచుండును. ఈ పనులను చక్కగ నెరవేర్చు