ఈ పుట ఆమోదించబడ్డది

సంతానవృద్ధి.

ఒకానొకనాచుమొక్కనుండి మరియొక నాచుమొక్క పుట్టునప్పటికి ఈ రెంటికి మధ్య నొకతరము గడచుచున్నది. అనగా నాచుమొక్కకు దానిమొక్క మనుమరికములో నున్నదని చెప్పవచ్చును. ఏలయన, తల్లినాచుమొక్కయందు ఆడువగు స్థూలబీజములును, మగవగు సూక్ష్మబీజములు నేర్పడుచున్నవి. ఇట్టిసంయోగాపేక్షగల సూక్ష్మస్థూలబీజములయొక్క ఐక్యమువలన సంయుక్తబీజము (Oospore) ఏర్పడుచున్నది. ఈ సంయుక్తబీజమునుండి తిన్నగా నాచుమొక్క పుట్టుట లేదు. అనగా సంయుక్తబీజము నాచుమొక్కకు గింజగాదు. అట్లయినచో నొక నాచుమొక్కకు మరియొక నాచుమొక్క పుత్రస్థానము బడసియుండును. అట్లు గాక యీసంయుక్తబీజమునుండి స్వతంత్రమైన (ప్రత్యేకమైన) వృక్షజాతిజీవియని చెప్పదగు ఒకపిండ మేర్పడుచున్నది. ఈపిండమునుండి సిద్ధబీజాశయము ఏర్పడుచున్నది. దీనినుండి స్త్రీపురుషవివక్షత లేనట్టియు, సంయోగనిరాపేక్షకములై నట్టియు అనగా సంయోగములేకయే అంకురించుటకు శక్తిగలిగినట్టియు సిద్ధబీజము లను విత్తనములు పుట్టుచున్నవి. ఇవియే నాచుగింజలు. ఇవి ముదిరినతరువాత కొంతకాలమునకు స్ఫోటనవిధానమున వీనినుండి మొటిమలు పుట్టుచున్నవి. ఈమొటిమలు క్రమముగా నాచుమొక్క లగుచున్నవి.

కాబట్టి నాచుమొక్కకు సంయుక్తబీజమువలన గలిగినపిండము పుత్రసమానము. పిండమునుండి పుట్టెడు సిద్ధబీజములనుండి యంకురించు నాచుమొక్క పిండమునకు పుత్రసమానము