ఈ పుట ఆమోదించబడ్డది

చుండును. శాఖ లెల్లప్పుడు ఆకుపంగనుండియే పుట్టున వగుటచేత వీనిని ఆకులనుండి గుర్తింపనగు. అనగా నొకానొకభాగము శాఖయా? కాదా? యను సందేహము కలిగినప్పుడు ఆభాగము ఆకునకును, కాండమునకును మధ్యనుండు పంగనుండి పుట్టుచున్నదా? లేదా? చూచుకొనవలెను. అట్టి పంగనుండి పుట్టుచున్న యెడల ఆభాగము శాఖయే. లేదా అది శాఖ కాదు.

ఆకులయుత్పత్తి.

ఆకులు శాఖలవలె అనంతమైన పెంపుగలవి గావు. ఇవి శాఖాంకురములవలెనే మొదట మొటిమలుగా పుట్టి, యా యంకురములు కొద్దికాలము మితమైన సంఖ్యగల కణములుగా విభజింపబడి శీఘ్రకాలములో ఆదోకగా పెరుగును. పిమ్మట దీని యంత్యకణము ముల్లువలె మొనకూరి దళమైన కణకవచము గలదై అవి భాజ్య మగును. ఇంతటనుండి దీనిపెంపు తగ్గిపోవును.

మూలతంతువులు.

ఇవి చూపునకు వేళ్ల వలె నుండునుగాని నిజమైన వేళ్లుగావు. ఈ భేదము నిజమైన వేరునుగూర్చి తెలిసికొనునప్పుడు గ్రహింప గలుగుదుము. ఇవి తప్పక స్కంధశిరములనుండియే అంకురించును. ఇవి పొడుగైన పోగులు. అక్కడక్కడ అడ్డుపొరలచే వేర్వేరుకణములుగా విభజింపబడి బూజుపోగును బోలియుండు కణపంక్తులు. ఇవియును బూజుపోగువలె అంత్యకణవిభాగముచేతనే పెంపొందును.