ఈ పుట ఆమోదించబడ్డది

నిర్మాణముచే గలిగిన హెచ్చు ప్రకాశమువలన వారి యజ్ఙానమను చీకటి నశించిపోయెను. సూక్ష్మదర్శనియంత్రము నిర్మింపబడిన క్రొత్తరికమున వారిలో సహితము ఉభయవాదములవారు నుండిరి. వారు సూక్ష్మజీవుల విషయములను బాగుగ తర్కించిరి. ప్రథమమున శోధన (Experiment) చేసినవారు జీవజపదార్థములరసము చక్కగ వడబోసి గాలియైనను చొరకుండ గట్టిగ బిరడవేసినను, దానియందు కొంతకాలమునకు లక్షలకొలది సూక్ష్మజీవులు పుట్టుచుండుట చూచి యీ జీవులు తప్పక కషాయమునుండి తనిచ్చగ (Spontaneously) పుట్టినవేయని తలంచిరి. సారా కషాయమును మిక్కిలి చక్కగ వడబోసి దానియం దేవిధమైన జీవియు లేదని మొట్టమొదట నిశ్చయము చేసికొన్న వారగుటచేత నీ సూక్ష్మజీవులన్నియు జీవులు లేని కషాయమునందు క్రొత్తగ పుట్టెనని వాదించిరి.

వీరివాదమును రెండవకక్షివా రామోదింపక తామును విసుగక పరీక్షలు చేసిచేసి వారితప్పులను కనిపెట్టిరి. వాడుకగా నిలువ యుండుటచే కుళ్లిపోవుపదార్థముల కషాయమును వీరును శోధన నిమిత్త మెత్తుకొనిరి. మొదట దానిలోనుండు జీవుల నన్నిటిని మిక్కిలి జాగ్రతతో నశింపజేయవలయుననియు, పిమ్మట దానిలోనికి జీవులు ఎంత సూక్ష్మములైనను, వెలుపలనుండి ప్రవేశించకుండ జాగ్రతపడవలెననియు, ఈ రెండువిధముల జాగ్రతలు పడినమీదట నింకను జీవజంతువులు పుట్టునెడల నవి స్వతస్సిద్ధముగ