ఈ పుట ఆమోదించబడ్డది

35 సంవత్సరాల ముందే నేను తెలుగు దేశం వివిధ ప్రాంతాలు పర్యటించి పొందుపరచిన కొల్లలైన జానపద గేయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఏయే రాగచ్ఛాయలలో ఉన్నాయో, ఏ గమక ప్రయోగాలు చేశారో గుర్తించి, వారి యాస, వారి భాష, పాడే పద్ధతి అలవర్చుకున్నాను. నాది ఒక విధమైన రిసెర్చి అనవచ్చు. నా యీ జ్ఞాన్ని (Knowledge) పాడడంలో చూపించాను కాని, డిగ్రీలకి ఆశపడలేదు. అయితే 1977వ సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ వారు లలిత, జానపద సంగీతాల్లో నేను చేసిన కృషిని గుర్తించి, నాకు "కళాప్రపూర్ణ" (Honorary Doctorate) ఇచ్చి గౌరవించారు. నేను సేకరించిన జానపదగేయ సమూహంలో నుంచి చాలా పాటలు నా చెల్లెలు వింజమూరి సీతాదేవికిచ్చి, ఆమె M. Litt. కి సహకరించాను. ఈ పుస్తకంలో కొన్ని పాటలను మాత్రమే స్వరపరచి, సంగీతంలో ప్రవేశం ఉన్న వారందరూ పాడుకోవడానికి వీలుగా ఈ గ్రంథ రూపంలో మీకు అందజేస్తున్నాను.

ఈ ప్రచురణకు కారకులైన ఆంధ్ర ప్రభుత్వము వారికి, ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ వారికి, తొలిపలుకు వ్రాసిన సోదరుడు డా|| బాలమురళీకృష్ణకు, నన్ను గురించి నాలుగు మాటలు వ్రాసిన వోలేటి వెంకటేశ్వర్లు గారికీ ఫ్రూఫ్ లు చూసిపెట్టిన మంచాల సోదరులకు, ముఖచిత్రం వేసిన మా బుజ్జాయికీ నా కృతజ్ఞతలు.

అనసూయదేవి.