పరిశోధకుడైన ప్రొఫెసర్ దేవేంద్ర సత్యార్ధి తాను రచించిన " మిట్ మై పూపుల్ " అనే గ్రంధంలో వ్రాసారు.
ఎందరు కవులరచనలో , ఆ కవులు అస్తమించగానే కాలగర్భంలో కలిసిపోతుండగా, లెక్కలేకపోతుండగా పుట్టుకు వస్తున్న జానపద గేయాలన్నీ చెక్కూ, చెదురూ లేకుండా, నాటికీ నేటికీ, సజీవంగా ఉన్నాయంటే ఆశ్చర్యమే. ఈ పాటలకు వార్ధక్యం రాకుండా నిత్యయౌవ్వనంగా మార్చిన శక్తి కొంతవరకు ఆ పాటలకు దక్కినా చాలావరకు ఆ పాటల సంగీతానికే దక్కుతుంది.
జానపద గేయాలన్నీ ఆ ప్రాంతీయ జానపద వ్యవస్థల నుండి పాతాళగంగలా పొంగి పొరలి వచ్చే అశుధారలే, బృందరచనలే. వివిధ వృత్తుల్లో దినమంతా కష్టించి బతికే జానపదుల నిత్య జీవిత సమస్యల రాపిడికీ వేడికి, సంగీతసాహిత్యాలు, ఏకకాలంలో ఏకధారగా పుట్టుకుని వస్తాయి. అవి అకల్మషులూ, నిరాడంబరులూ, అయిన గ్రామీయుల భావాలు, ఆశలు, ఆశయాలు, ఏకమై ఉప్పొంగిన అయాచిత అశుధారే జానపదగేయము. ఆ గేయాలు నవరస భరితాలు.
ఆంధ్రులకు ఆశయాలూ, అవహేళనలూ కూడా ఎక్కువే కదా ! పండుగలకూ , పబ్బాలకూ, కష్టాలకూ, సుఖాలకూ, జానపదులకు, హృదయతంత్రులు, ఇచ్చే స్పందన వెంటనే సంగీతంతో పెనవేసుకు పోయిన, మాటలే జానపద గేయాలు. తెలుగునాటి జానపదులంతా తమ్ముతామే యెరుగని , తమ సంస్కృతి ప్రతిబింబాన్ని చూసుకోవడం చేతకాని అదృశ్యవాగ్గేయకారులే అనిపిస్తుంది. మానవజీవితంలోని వెలుగు నీడలు , ప్రేమ, ద్వేషము, శాంతి, జానపద, సమరము, సంరంభం, సంతాపం, యౌవ్వనము, వృద్ధాప్యమూ అన్నీ జానపద గేయాలకు కధా వస్తువులే. తెలుగునాట జానపద తటాకంలోని ప్రతి అలా ఒక గేయంగా రూపొందుతూ వచ్చింది. తెలుగువారి నిత్య జీవిత క్రమాన్ని అనుసరించే వారి జానపద గేయాల క్రమము కూడా ఏర్పడింది.