జానపద గేయాలు
ఎన్ని వందలఏండ్ల అవధులూ, అగడ్తలూ దాటుకుని వచ్చాయో ఈ జానపద గేయాలు! ఎంత ప్రాణం ఉన్నదో వీటికి! ఆ ప్రాణంతో ఎటువంటి అందచందాలూ, అలంకరణలూ ఉన్నాయో వీటికి! వాస్తవిక జీవితానుభవాలూ, ఆ అనుభవములు రేపిన ఆవేశాలు, ఆ ఆవేశాలు ప్రేరేపించిన భావనా, ఆ భావన కల్పించిన చిత్రాలూ, ఆ చిత్రాల్ని నిర్మించిన మాటలూ, ఆ మాటలు మళ్ళీ, మనుష్యులై మనయెదుట నవ్వడమూ, నాట్యం చేయడమూ, నిట్టూర్చడమూ, జీవితఖండాలను ప్రదర్శించడమూ - ఈ జానపద గేయలకు ప్రజలకులాగే జరామరణాలు లేవు. ఎప్పుడో బయలుదేరి ఎక్కడికో పోతూవున్న అఖండ ప్రజావాహినికి ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు, నిండుతనమూ, జీవనమూ ఇస్తూ, కదలిస్తూ, ఈ జానపద గీతాలనే ఉపనదులు ఉపకరిస్తూ వస్తున్నాయి. ఇవి సరళంగా ఉంటూ సుందరంగా ఉంటాయి. వాస్తవికంగా ఉంటూ వైకుంఠానికి నిచ్చెనలేస్తాయి. అమాయకంగా ఉంటూ, మానవ ప్రకృతిలోనే, అచల శిఖరాలూ, అఖాతాలూ అందుకుంటాయి. అచ్చంగా భూగర్భంలోంచి పొడుచుకుని వచ్చి మొలుచుకుపోయే చెట్లూ, చామలూ, లతలూ, పూతలూ వంటివి ఈ జానపద గేయాలు.
మన దేశంలోని అల్ప సంఖ్యాకులూ, నాగరికులూ, అయిన పట్టణ వాసులకులాగే లక్షలాది గ్రామాలలో నివసించే జానపదులకు కూడా, ఒక విశిష్టమైన సంస్కృతి ఉంది. అదివాళ్ల నిరాడంబర జీవితాన్ని ప్రతిఫలింపజేసే వాళ్ల జానపద గేయాల్లో ఉట్టి పడుతూంటుంది. దేశంలోని ప్రతి ప్రాంతం వారికీ ఎన్నో జానపద గేయాలున్నాయి కాని, బాహుళ్యంలోను ప్రశస్తిలోనూ, వివిధత్వములోను, అవేవీ తెలుగువారి జానపద గేయాలకు సాటేరావనీ, ఆ విశిష్టతకు కారణము తెలుగుభాష యొక్క తియ్యదనమే నని సుప్రసిద్ధ జానపద