పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/84

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేదని తీర్మానించినారు. అప్పుడు మూర్తి తానా ప్రక్క పెద్ద కొండను కొంత భాగం దొలుస్తానని దానికి ఇంకా పదమూడు లక్షలు ఖర్చు అవుతుందనీ, అందువల్ల వేయి చదరపు గజాలు వస్తాయని తెలిపినాడు. అవన్నీ ప్లానులు వేసి చూపినాడు.

ఆ ప్లానులన్నీ పట్టుకొని చీఫ్ ఇంజనీరు, మిలటరీ చీఫ్ ఇంజనీరు వారం రోజులు పరీక్షించినారు. వారికి మూర్తి వాదనలు నచ్చి, పని ప్రారంభించవచ్చునని ఆజ్ఞలు జారీ చేసినారు.

ఆ పదిహేను దినాలు మూర్తి తిన్నగా భోజనం చేయలేదు. జెన్నీ దగ్గిర లేకపోతే అతడు మతిచెడి ఏలాంటి పిచ్చి పనులు చేసి ఉండేవాడో!

“ప్రియతమా! నీ ధైర్యం అంతా ఏమయింది. అమెరికాలో నువ్వు చేసిన పని అంతా మంచులా కరిగిపోయిందా?”

“జెన్నీ దేవతా! నేను యే పని చేయగలను? యుగయుగాలనుంచీ భారతీయ సంఘంలో అట్టడుగున కుళ్ళిన మాదిగ కులస్థుణ్ణి!”

“అవునులే! భారతీయ సంఘంలో కొండ శిఖరాలు మీద కూర్చున్నవారే ఈలాంటి చదువులు చదవాలిగాని నీబోటి వాళ్ళు ఏం పనికి వస్తారు?”

“వేళాకోళం కాదు జెన్నీ.”

“కాదులే... కాదు! మూడక్షరాలా ని...జ...ము? నువ్వు మాదిగ కులస్థుడవు గనుక, నిజం మాట్లాడుతావని నాకు నమ్మకం లేకపోయినా, ఏమో నిజం అయితే కావచ్చును.”

“జెన్నీ, నే నేం జేయను.”

“ఏం చేస్తావు? మళ్ళీ జక్కరం వెళ్ళి పొలం కూలీపని చేసుకో. చచ్చిన గొడ్డు మాంసం తిను.”

“ఈ రోజు నన్ను కొరడా పుచ్చుకొడుతున్నావే?”

“లేక నీ ధైర్యానికి, నీ ఉత్సాహానికి, నీ ముందుచూపునకూ కష్టాలు లెక్కచేయకుండా చొచ్చుకుపోవడానికి ముద్దులు పెట్టుకోమన్నావా?”

“అబ్బబ్బా!”

“క్షమించు ప్రియా! భారతాంగన భర్తకు బానిస! అలాంటిది నీకు సలహా చెప్పడ మేమిటి?”

ఎల్లమందమూర్తి మౌనం వహించాడు. అతని మోము విషాద పూరితమైనది. అతని మోము తీక్షణంగా గమనించింది జెన్నీ. వెంటనే అతని చేయి పట్టుకొని డేరా లోనికి తీసుకు వెళ్ళింది.

అక్కడ అతని హృదయాన్ని బిగియార కౌగలించుకొని పెదవులు ముద్దిడి, “ప్రియా! అంత చిన్న బాలునిలా అయిపోయావేమిటి? నువ్వు చేయలేని పని ఒకటైనా ఉందా? కాక, నాకు నువ్వంటే నేనే వర్ణించుకోలేని ధైర్యం. నీకు వేడి పుట్టించడానికి అన్న మాటలు,” అని మళ్ళీ ముద్దు పెట్టింది.

అడివి బాపిరాజు రచనలు - 7

82

నరుడు(సాంఘిక నవల)