పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/48

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ చప్పుడు విని లయొనెల్ చప్పున తన గదిలోనుండి చక్కా వచ్చాడు. సోఫామీద వాలి విజ్జీ మూర్ఛపోయినట్టు గడబిడ పడుతున్నది. ఇంతట్లో లయొనెల్ పరిచారికను వాసనమందు తీసుకురమ్మనమని చెప్పి పరుగున వెళ్ళి ఫోను చేశాడు.

పరిచారిక విజ్జీకి ముక్కు దగ్గిర మందు వాసన చూపిస్తూ “యూడికోలోన్”తో తడిపిన గుడ్డతో నుదురు అద్దుతూ ఉన్నది. ఇంతట్లో డాక్టరుగారు చక్కా వచ్చారు.

ఆయన పరీక్షచేసి ఎలిజబెత్తు గర్భవతి అనిన్నీ ప్రథమ గర్భందాల్చి ఉన్న బాలికలు కొంత నరాల సంబంధమయిన గడబిడలకు పాల్పడతారనిన్నీ, కాని పదిరోజులపాటు మందు ఇచ్చి ఆ తర్వాత గర్భబలానికి ఆమె బలానికీ మందు ఇస్తూంటే పురుడు సరీగా జరగగలదని ఆ డాక్టరుగారు లయొనెల్‌కు చెప్పి మందు వ్రాసి యిచ్చారు.

ఇంతట్లో జెన్నీ ఇంటికి వచ్చింది. వదినగారి దగ్గరకు వెళ్ళి కౌగలించుకొని, ఆమెకు రెండు గంటల పరిచర్య చేసింది. విజ్జీకి ద్రవాహారం ఇచ్చి నిద్రబుచ్చింది.

జెన్నీ రెండు రోజుల సెలవుపెట్టి మూర్తితో ఒక్క మహా ప్రవాహానందంతో గడిపింది. అతడు పనిమీద వెళ్ళి మళ్ళీ వచ్చేవరకూ అతనికోసం ఎదురుచూస్తూ వుండేది. అతన్ని సినిమాలకనీ, విహారాలకనీ తీసుకుపోయేది. రాత్రి రెండు గంటలవరకూ అతని ఒడిలో వాలి వుండేది. అసలు నిద్రనేది లేకుండా వుంటే బాగుండుననుకునేదీ.

రెండు రోజులూ అయిన వెనక ఉద్యోగానికి వెడుతూ ఉండేది. పని అయిన వెంటనే తిరిగి తిరిగి ఇంటికి రావడం! రావడంతోటె ఎదురుగా ఎల్లమంద వుండాలని అతనికోసం ఎదురు చూడడం!

ఇదంతా చూచే ఎలిజబెత్తుకు మతిపోయింది. ఆరవ రోజు రాత్రి లయొనెల్ ఎలిజబెత్తులు తిరుచునాపల్లి వెళ్ళి పోయినారు. ఏడవ రోజు ఉత్తరాదికి పెద్ద కొడుకునూ, కోడలినీ, వారి బిడ్డలనూ చూడడానికి వెళ్ళిన ఎడ్వర్డు కార్ల్‌యిల్‌గారు ఆయన భార్యా ఇంటికి వచ్చారు.

ఎడ్వర్డు కార్ల్‌యిల్‌గారు అయిదు సంవత్సరాల క్రితమే విశ్రాంతి వేతనం తీసుకొని ఉద్యోగం నుండి విరమించారు. అతనికిప్పుడు అరవై రెండు ఏళ్ళు ఉన్నాయి. ఆయన భార్య పేరు డోరిస్. ఆమెకు ఏభై ఎనిమిది సంవత్సరాలున్నాయి.

వారిద్దరూ రావల్పిండిలో పెద్ద కొమరుడు మేజరు రిచ్చర్డుకు అతిథులుగా వుండి, అక్కడినుంచి కాశ్మీరము, ఆల్మోరా, ముస్సోరీ, కరాచీ, జయపురం మొదలయినవి తిరిగి, రావల్పిండి వచ్చి పదిరోజులుండి బయలుదేరి చెన్నపట్నం వచ్చినారు.

కార్ల్‌యిల్‌గారి బంగాళా ఇల్లు కీల్పాకులో పూనమల్లీ రోడ్డుమీద పెద్ద తోట మధ్య వుంది. యూరేషియనైనా మదరాసులో వర్తకం చేసేటట్టీ, ఉద్యోగాలలో ఉన్నట్టి బ్రిటీషు పెద్దల గౌరవం పొందుతూ తానూ తన భార్యా బిడ్డలూ వారి ఇళ్ళకు అతిథులుగా పోతూ, తానూ వారిని తమ ఇంటికి విందులకు పిలుస్తూ గౌరవం పొందుతూ వుండేవాడు.

కార్లయిల్ కుటుంబంలో కొందరు ఇంగ్లీషు విధవలను, కొందరు ఇంగ్లీషు బాలికలను పెళ్ళి చేసుకున్న మాట నిజం. ఆ బాలికలూ, ఇంగ్లీషు విధవలూ అంత పెద్ద కుటుంబాలవారు కాకపోవచ్చును. కాని,పదహారణాల ఆంగ్ల రక్తంవారు.

అడివి బాపిరాజు రచనలు - 7

46

నరుడు(సాంఘిక నవల)