పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/41

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సినీమా చూసి, వారు మువ్వురూ భోజనపు దుస్తులు మార్చుకోవడానికి ఇంటికీ, మూర్తి కానుమెరాకు వెళ్ళినారు.

మూర్తిని అఖిల భారతీయ ప్రభుత్వంవారు తమ ఇంజనీరింగు శాఖలోనికి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని విషయమై, మూర్తికి, కేంద్ర ప్రభుత్వానికి చేరాల ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఈలా జరగడానికి కారణం మూర్తి గురువుగారు అమెరికానుంచి మూర్తి విషయం రాజప్రతినిధికీ, ఇంగ్లాండు భారత కార్యదర్శికీ రాయడమే'

మూర్తి విషయం కానుమెరావారికి తెలిసింది. వారికి ఎంత గౌరవమో కలిగింది. రంగుతేడా కాని మేధావంతుడైన ఇంగ్లీషు “నీలరక్తపు” పెద్దమనిషితో సహా సమానంగా సంచరిస్తున్న మూర్తి అంటే ప్రేమ కుదిరింది. కానొమెరా మేనేజరు మూర్తిని అమెరికా విషయాలు అనేకం అడిగి తెలుసుకోవడం అంటే సరదాపడసాగినాడు.

మూర్తి వేషం మార్చుకుని సరిగ్గా అనుకున్న సమయానికి క్రిందికి దిగినాడు. జెన్ని, లయనెల్, ఎలిజబెత్తులు కారు దిగినారు.

లయెనెల్, జెన్నీ, ఎలిజబెత్తులు కొంచెం ఛాంపేను త్రాగినారు. మూర్తి తాను త్రాగనని కాంగ్రెసు నాయకులకు వాగ్దానం ఇవ్వడంచేత ఏవైనా రంగునీళ్ళు త్రాగేవాడే. కాని వాట్లజోలికి వెళ్ళలేదు. లయెనెల్ మూర్తిని చాలామంది తన మిత్రులకు ఎరుకపరచినాడు. వాళ్ళకు మూర్తి అంటే అంత గౌరవమేమి ఉంటుంది. “ఒక వెధవవాయి నిగ్గర్” అనుకున్నారు. కాని వాళ్ళందరికీ ఎలిజబెత్తుతో, జెన్నీతో నాట్యాలు కావాలి.

జెన్నీ, మూర్తికి ఆరు నాట్యాలు ఇచ్చింది. రెండు మూడు ఇతరులకు ఇచ్చింది. మూర్తితో కలసి బయట కూచుని మాట్లాడడం ఏర్పాటు చేసుకుంది. రెండు నాట్యాలు ఎలిజబెత్తుతో నాట్యమాడడానికి ఎలిజబెత్ నడిగి ఆమె అనుమతి పొందాడు.

మూర్తి ఎంతో అందంగా నాట్యం చేశాడు. జెన్నీ అతని చేతులలో ఇమిడి అతనితో నాట్యం చేస్తుంటే, ఆమె ఇంతకుముందు ఎవరితో నాట్యం చేస్తున్నా అనుభవించని ఆనందం అనుభవించింది.

అతడామెను ఏ లోకానికో తీసుకుపోయేవాడు. అతని అడుగు గోదావరి ప్రవహింపులా ఉంది. అతని స్వరూపము కంచుతో పోతపోసిన అపోలో విగ్రహంలా ఉన్నది. నడుం చుట్టూ చేయివేసి అతడు తన్ను తేల్చుకొని పోతూవుంటే జెన్నీకి హృదయము కరిగిపోయింది. ఆనందంతో ఆమె అతనికి మరింత దగ్గరగా వచ్చింది. చివరకు అతన్ని అదిమివేసుకొన్నది.

అతడు పురుషుడు, ఆమె స్త్రీ! యుగయుగాల నాటి నుండీ ఆమె అతణ్ణి కోరింది. అతడు ఆమెను కోరినాడు. గుహలలో, పొలాలలో, పట్టణాలలో, ఈజిప్టులో, గ్రీసులో, అరేబియాలో, చీనాలో, అమెరికాలో, జర్మనీలో, ఇంగ్లండులో, ఇండియాలో, నూగినియాలో, ఒకరినొకరు వాంఛించారు. కలుసుకొన్నారు. గాఢమధుర మత్తతాశ్లేషాలలో పరిమళ చుంబనాలలో వివశత్వం చెందారు. ఆమెకు ఒడలు తెలియలేదు. అతనికీ తెలియలేదు. ఇద్దరూ ఉప్పొంగిపోయినారు.


అడివి బాపిరాజు రచనలు - 7

39

నరుడు(సాంఘిక నవల)