పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/159

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“తల్లీ నువ్వే నాకు కన్నకూతురువు. బిడ్డలులేని లోపం నీ భర్త సహచర్యం నీ సహచర్యంవల్లా తీర్చుకొంటున్నాను. ఏదో మన దురదృష్టవశాత్తూ ఈనాటికి ఏవేవో సంఘటనలు వచ్చాయి” అని అతడు శ్రీమతివైపు చూచి, “అమ్మా పదండి!” అన్నాడు.

వారందరూ నెమ్మదిగా నడకసాగించారు.

శ్రీమతి “ఏమిటండీ నరసింహమూర్తి మేష్టారు, ఈ కన్యాకుమారి అగ్రాన్ని గూర్చిన విశేషాలు?” అని ప్రశ్నించింది. ఆమె తమలోని ఈ ఆవేదన ఉపశమనం అయ్యేందుకు ఈలా ఏదేని విషయాన్ని గూర్చి సంభాషణ ప్రారంభించిందని పద్మావతీ, నరసింహమూర్తి మేష్టారూ గ్రహించారు. పద్మావతి త్వరగా ఉపశమనం పొందలేకపోవచ్చును. తన విధి శ్రీమతిగారిని మద్దతుచేయటమే కదా! అమ్మాయి దుఃఖంచూచి, తానూ కరగిపోయాడు. కాని తాను ఈ లోక సంబంధం మానుకుని, భగవచ్చరణారవిందాలలో మనస్సు లగ్నం చేసుకోడమే తనకు విధి అనుకున్నాడు.

“శ్రీమతిగారూ! ఈ అగ్రం ఏవేవో విచిత్రభావాలను ఉద్భవింపచేస్తోన్నదండీ. ఇది భారతదేశానికి దక్షిణపు కొన. రవివర్మగారు ఈ అగ్రాన్నే - నిలుచున్న ఒక దివ్య మాత పాదాలుగా చిత్రించారు. సముద్ర హృదయాంతర దివ్యభావ మహాతరంగాలలో స్పందనమయ్యే భారతవీణ శ్రుతితీగ మీటి కనబడింది నాకీ అగ్రం. కన్యాకుమారీ భావం సంపూర్ణంగా అర్థం కాలేకపోయినా, అనన్య పరమభావాలేవో నన్ను కదిపివేస్తున్నవి. విరిగిపోయిన శాంతి తిరిగి హృదయంలో చేరుకుంటున్నది.”

"నరసింహమూర్తి మేష్టారూ! పద్మావతికి పరీక్షలు దగ్గరకు వచ్చినాయి. ఇంతవరకూ బాగానే చదివింది కాని, ఇకముందు ఏమి చేస్తుందో అని కొంచెం భయంగానే ఉంది నాకు. అసలు పద్మావతికి పరీక్షలో విజయం పొందవలసిన అవసరం ఉందని కాదు. ఆమెకు పరీక్షలో నెగ్గడం గౌరవ సంబంధం మాత్రమే అని నాకు తెలుసు. అయినా చిహ్నమాత్రమైన పరీక్ష నెగ్గడం నెగ్గకపోవడాలలో, ఈ రోజులలో మానవ మానసిక ప్రవృత్తి సంపూర్ణ బాంధవ్యం సంపాదించుకుంది. పరీక్షలు నెగ్గి పైకి వెళ్ళడం అనే ప్రయత్నంలో, మానవునకు జ్ఞానం పాలసముద్రంలా వెల్లివిరుస్తుంది.”

"పద్మావతి నాలుగు కచ్చేరీలు చేసుకుంటే పదివేలు సంపాదించుకుంటుంది. అయినా మీరన్నట్లు ఈనాడు ఈ పరీక్షలకు, మానవజీవితానికి ముఖ్యమైన సంబంధం ఉంది సుమండీ!”

“బాలసుబ్రహ్మణ్యంగారు ఎం.ఎ. ఆయన మొదటి శ్రేణి గాయకోత్తముడు. ఆ ఎం.ఎ. డిగ్రీ ఆయనకు ఇంకో లక్షగౌరవం తెచ్చి పెడుతూ ఉందికదా!”

“అందుకనే కాదండీ కవిత్వంవల్ల ప్రసిద్ధనామం సంపాదించుకున్న వారికి డిగ్రీ ఉంటే, లేనివారికన్న ఎక్కువ గౌరవం చేస్తాము. అలాగే సినిమా తారల విషయంలోనూ!”

“అయితే మీ ఉద్దేశం పద్మావతి పరీక్షలో కృతార్ధతను పొందడమే మంచిదని.”

“కాదండీ మరి!”

“అయితే ఫిబ్రవరి వచ్చింది. ఈ నెల అంతా గట్టిగా చదివితే చాలు. మార్చి రెండవవారంలో కాశీ వెడతాను. అప్పటికి అమ్మాయి .ఫస్టుగా ప్యాసవడానికి సరియైన స్థితికి వస్తుంది.”

అడివి బాపిరాజు రచనలు - 7

157

జాజిమల్లి(సాంఘిక నవల)