పుట:Himabindu by Adivi Bapiraju.pdf/86

ఈ పుట ఆమోదించబడ్డది

తన మేనకోడలిని చూచుటకు డెమిత్రియసు ఆంధ్రదేశమున కెన్నిసారులో వచ్చినాడు. చెల్లెలిని మేనకోడలిని తన బావ కీర్తిగుపుడు తక్షశిల కొనివచ్చునప్పు డెంతయు యానందమందినాడు. మేనకోడలు ఆతనికి ప్రాణమైనది. తన కొమరుడు హెరాక్లియసు ప్రజాపతిమిత్రను పెండ్లియాడి తీరవలయునని పట్టుపట్టినాడు.

ప్రజాపతిమిత్ర చారుగుప్తుని పెండ్లియాడనున్నదని శుభలేఖ వచ్చినప్పుడు హెరాక్లియసు డెమిత్రియసు లిరువురు కొంచెము హృదయ బాధకు లోనైరి. కాని వారు యాత్రలు సాగించి, మహదాంధ్రముచేరి, ధాన్యకటకమునకు బోవునప్పటికి వినయగుప్తుని వైభవము వారికన్నుల మిరుమిట్లు గొల్పినది. వారి గాథలలో ధనమునకు ప్రసిద్ధికెక్కిన క్రోసియసురాజు వినయగుప్తునికడకు అప్పుకు రావలెను అనుకొనిరి. చారుగుప్తుడు వినయగుప్తునిమించి, యౌవనములోనే అనేక సముద్రయానములు చేసి సాహసియని కీర్తిగొన్నాడు.

అప్పుడా యవనజనక కుమారులకు చారుగుప్తుని ప్రజాపతి యెందుకు ప్రేమించినదో అర్థమయినది. డెమిత్రియసు ఆంధ్రాచారమున ప్రజాపతిని బంగారుతట్టలో మోసి కల్యాణమంటపమునకు గొనివచ్చినాడు. డెమిత్రియసు భార్య సెలినేదేవి ఆంధ్రాచారముల గమనించుచు, అక్కజంపడుచు. తానును ఆంధ్రాంగనావస్త్రాలంకార శోభితమై ముక్తావళీదేవిచే, వినయగుప్తుని భార్య గుణవతీదేవిచే ఎన్నియో మన్ననల నందినది. చిన్నతనములో యవనభూమియగు గ్రీసులో తా నెరింగిన పెర్లాదేవి వేరు, ఈనాటి ముక్తావళీదేవి వేరు.

హిమబిందు పదమూడవఏడు జరుగుచున్నప్పుడు వృద్ధుడగు డెమిత్రియసు దేవతల జేరినాడు. ఆమెకు పదునాల్గవఏడున ప్రజాపతిమిత్ర వ్యాధిగ్రస్తురాలయినది.

చారుగుప్తుడు మతిలేనివాడైపోయినాడు. దేశదేశముల ప్రసిద్ధి నందిన వైద్యులు చారుగుప్తునిచే నాహ్వానితులై వచ్చినారు. ఆంధ్రధన్వంతరులు, చరక శుశ్రుతాది మహాశాస్త్రకోవిదులు దివ్యసుందరి యగు నా సుశీల ప్రజాపతిమిత్ర రోగముచే ననేక విధముల పరిభవింపబడినారు. ఆమె ప్రజ్ఞాపరిమితాదేవిలో ఐక్యమైపోయినది.

చారుగుప్తుడు, వినయగుప్తుడు, కీర్తిగుప్తుడు మువ్వురును మంచము పట్టినారు. ముక్తావళీదేవికి కన్నుల నీరింకిపోయి యొకపక్షముదినములామె చైతన్యరహితయై పడియుండెను.

హిమబిందునకు తల్లి మాయమగుట యను భావ మర్థము కాలేదు. ఇతరులు ఏడ్చినప్పుడామె దుఃఖించినది. దినములు గడచినకొలదియు ఆమె బెంగచే కృశించి పోయినది. బాలిక దుఃఖము చూచి మువ్వురు వణిక్చక్రవర్తులూ దుఃఖమాపుకొనిరి. ముక్తావళీ దేవి తెలివినంది, తన ప్రజాపతి హిమబిందులో నున్నదని ధైర్యముచెంది యా బాలను దివ్యప్రేమచే చుట్టివేసినది. ఏడులు గడచినకొలది హిమబిందు తేరుకున్నది. కాని ఆమె తల్లి ప్రతిరూపము తన పూజామందిరమున నుంచుకొన యౌవనారూఢయైన హిమబిందు ఆశించినది. చారుగుప్తుడు భార్య నూత్నవధువై తన ఇంటికి వచ్చినప్పుడు, ధర్మనంది బావమరిదియు ప్రఖ్యాత స్వర్ణాదిలోహ శిల్పియునగు అమరనందులవారిచే భార్యా ప్రతిమను చిన్న స్వర్ణమూర్తిగా రచింపచేసినాడు.

ప్రజాపతిమిత్ర హిమబిందును చంక కెత్తుకొను రోజులలో శక్తిమతీదేవి ధర్మనందులవారిచే బాలనెత్తికొనిన మాతృమూర్తిని ధవళశిలా శిల్పముగ విన్యసింపఁ జేసెను. చారుగుప్తుడా రెండవప్రతిరూపము తన పూజామందిరమున నెలకొల్పెను

అడివి బాపిరాజు రచనలు - 2

• 76 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)