పుట:Himabindu by Adivi Bapiraju.pdf/70

ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వశాఖతికములు, పర్జన్యకములు, ఊర్థ్వబాహువులు చెడిపోయినవి, చెడిపోవుచున్నవి. కాన వినీతమతి తప్పక నశించును.

ఇవన్నియు స్ఫుటాక్షరముల నాతని దృగ్వీధిని నడయాడుచున్నవి. తనకడ నొక నెలకు సరిపడిన పుష్కలాహారపదార్థములు కలవు. గోధుమలు, బియ్యము, పప్పు ధాన్యములు, బెల్లము, కోళ్ళు, కౌజులు, మేకలు, గొఱ్ఱెలు, లేళ్ళునున్నవి. ఇప్పుడు కర్తవ్యమేమి? ఏది యెట్లయినను తాను కోటలోనికి చొచ్చుకొనిపోవలె, తనక్రింది సేనాధికారులు, చమూపతులు, దండనాయకులు అందరితో సమాలోచన చేసినాడు. కొందరు చక్రవర్తియే మహా సైన్యముతో వచ్చి తాకెనని బెదరించెదమనియు, కొందరు మన మచ్చటనుండియు, కోటలోనుండి వినీతమతియు తాకినచో నిరు సైన్యములు విరోధిసైన్యముల నుగ్గాడవచ్చుననియు దెల్పిరి. కాని సమదర్శియొక్కటే నిశ్చయించుకొనెను, ఝంఝామారుతముచే సముద్రము మహా భయంకరముగా నున్నను నావికుని సామర్థ్యమున ప్రమాదముగా బోవు నౌకవలె, కఱ్ఱను చీలగొట్టి చొచ్చిపోవు పరశుముఖము వలె, సమదర్శి మాళవ సైన్యముల జీల్చి కోటద్వారముకడకు బోవుటకు నిశ్చయించెను. ఏ ద్వారము కడకు తాను రానున్నాడో ఆ ద్వారముకడ సిద్ధముగనుండి గోపురద్వారము చటుక్కున తెరచి కొన్ని సైన్యములు వెలుపలికివచ్చి చీకాకుగూర్పవలె ననియు, రాత్రి అమిత వేగమున తాను వచ్చెదననియు గోటలోనికి వార్తనంపెను.

రాత్రిపండ్రెండుగంటలగునప్పటికి కోటచుట్టుచున్న మాళవసైన్యములతో సమదర్శి తలపడెను. పేరుగాంచిన ఆంధ్రమల్లులు అయిదువేల సంఖ్యవారు పంక్తికి నాల్గువందల చొప్పున కలసి ముందునడచిరి. వారి ఎడమచేత దేహమంతయు గప్పు ఖడ్గమృగచర్మపు డాళ్ళుండును. కుడిచేత తొమ్మిదిఅడుగుల పొడవుగల వాడిశూలము లుండును. మొలను చిన్నకటారి యుండును. వీరందరు శూరులు, గజసత్త్వులు, చావవలెగాని వారు వెనుకకు తిరిగిరారు. వారిని ఆంధ్ర సైన్యాధిపతులు, చక్రవర్తులు ప్రాణాపాయములు వచ్చునప్పుడే గాని ప్రయోగింపరు. అట్టి ధీరులు ఆంధ్ర సైన్యముల ఏబదివేలున్నారు. భారతీయ సైన్యములు యుద్ధము చేయునప్పుడు గజముల గజములు, అశ్వముల అశ్వములు రథముల రథములుదాకింతురు. నేడు సమదర్శి మల్లులకీవలావల అశ్వదళములుంచెను. వీనివెనుక రథములు, అన్నిటికి వెనుక ఏనుగులనుంచి యుపాయముమై మోహరము పన్నెను.

ఆంధ్రవాహిను లిట్లమిత వేగమునవచ్చి తాకుటచే మాళవ సైన్యములు చీకాకు నందెను. అటు చటుక్కున దుర్గమహాగోపురద్వారము తెరువబడి వినీతమతి సైన్యములువచ్చి తాకుటచే మాళవులు చిక్కుపడిరి. ఈ కల్లోలములో సమదర్శి సైన్యములు జవమున మాళవ సైన్యములోనికి చొచ్చిపోవుచున్నది. ఆంధ్రమల్లులు తమ త్రోవ కడ్డమైనవారినెల్ల శూలముల కెరచేయుచు మరల నా శూలము లాగుకొనుచు ముందునకు సాగిపోవుచుండిరి. వారి కిరుదెసల అశ్వదళములు పార్శ్వరక్షణ మొనర్చుచుండెను. హిమ పాతమువలె వచ్చు నా సైన్యము బారిపడి రిపులు నడపొడ మాసిపోవుచుండిరి. సమదర్శి ప్రళయ కాలరుద్రుని వలె నుండెను. మహానది ప్రవహించుచున్నట్లు పోవుచుండెను. అతని సైనికులు సింహములవలె పోరాడిరి. మాళవదళములు ఆ రాత్రి యేమరుపాటునకు వెఱుగుపాటు తోడుగా గలగుండువడి, దిక్కు తెలియక, పంచ బంగాళమై విచ్చిపోయినవి. సమదర్శి సైన్యములకు దారి యిచ్చినవి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 60 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)