పుట:Himabindu by Adivi Bapiraju.pdf/66

ఈ పుట ఆమోదించబడ్డది

వినీతమతిని పంపితిమి. ఆతనికి లొంగిపోయెనని వార్తాహరులు వచ్చియుండిరి. ఇంతలో ఏమరుపాటున పుళిందులచే తిరుగుబాటు చేయించి, భోజుల సహాయముగా గొనివచ్చి ఉజ్జయినిలోనున్న వినీతమతిని ముట్టడించెను. ఆతడు ధైర్యముతో కోట కాపాడుచున్నాననియు, త్వరలో సైన్యముతో సహాయము రానిచో తాను తన చమువులతో నశించిపోవలయుననియు వార్తాహరుల నంపుచున్నాడు. వినీతమతిని మాళవుడు ఓడించునట. పుళిందులు ప్రతిష్ఠాన నగరముపై దండు విడియనున్నారు. నీకు పుళిందులతోను, మాళవముతోను మహత్తరమగు వర్తకవ్యాపారమున్నది. నీ యాలోచన మా కత్యంతము ముఖ్యమైనది.

చారు: జయము దేవా! ఈ విషయమంతయు నేను శ్రద్ధగా నాలోచించితిని. కొన్ని సైన్యములను ముందు ప్రతిష్టానమునకు సహాయము పంపవలయును. మనము సర్వసైన్యములతో తరిమి నడచి మగధ పైకెత్తిపోయి అచట కాణ్వులకు, అగ్ని మిత్రుని సంతతివారికి బుద్ధిగరపి, వెనుక మాళవాధిపతిని నిర్జించి, ఆ వెనుక పుళిందుల నడంచి, భోజులపని పట్టించి వారి రాజ్యము మనము స్వాధీనము చేసికొనవలయును.

అచీర్ణుడు: అట్లయినచో పుళిందులు వెనుకనుండి మనయాత్ర సాగనీయరు గదా!

స్వైత్రుడు: చుట్టును శత్రువులు క్రమ్ముకొనియుండ మనము విరోధులపై బోవుట అపాయకరము. ఈలోపల మాళవమున వినీతమతి సంకట మధికమగును.

శ్రీముఖుడు: పుళిందు లెప్పుడును ప్రబలశత్రువులు.

చారు: మీరు తెలుపు కారణములు భయహేతువులుకావు. పుళిందులడవులు, కొండలు విడిచి సమప్రదేశములలోనికి వచ్చి శిక్షితులైన సైనికుల నెదిరింపలేరు. వారిని నడుపుటకు శిక్షితులగు సేనానాయకులు లేరు కావున వారివలన భయములేదు. మనము మగధమునకు కళింగము దారి ప్రయాణము సాగించెదము. విరోధులకు మన పోకడ తెలియవచ్చు మునుపే మగధ యందుండగలవారము. పుళిందుల నణుచుటకు ఆ అడవులలో మనకు చాలకాలము పట్టును. ఈలోన వినీతమతి దగ్ధమైపోవును. అటువెనుక ఏనుగులదండు అడవిబడినటుల, దావానలము కాంతారము చొచ్చునటుల వింధ్యాటవుల బడి పుళిందుల నుక్కడిగింపవచ్చును. పై భాగము లోబరచుకొని మనము అటునుండిరా, యువరాజు ఇటునుండి రా, మధ్య పుళిందులు చిక్కుకొనగలరు. భోజులుపూర్తిగ మాళవులకు బాసట కాకమునుపే మనము ఉజ్జయిని నుండవలయు. దీనివలన మనకు చెప్పరాని లాభ మింకొకటి యున్నది.

అచీర్ణుడు: ఏమది?

చారు: (సార్వభౌముని దిక్కు మొగంబై మధ్యమధ్య మంత్రిని, సేనానాయకుని జూచుచు) ఇది భరుకచ్చము. పశ్చిమ సముద్రపు రేవు పట్టణములలో ముఖ్యమైనది. దానిలాభము భోజులు పూర్తిగా అనుభవించుచున్నారు. ఇప్పుడు భోజరాజ్యము స్వాధీనము చేసికొని ఒక ప్రతినిధిని భరుకచ్చమున నుంచినచో, పాశ్చాత్యదీవులలో వర్తకము మచిలీపట్టణము నుండియు, మోటుపల్లినుండియు జరుగుటచే మనకు అమితనష్టము కలుగుచున్నది. కావున భరుకచ్ఛము ఆంధ్రచక్రవర్తుల స్వాధీనమందుండ వలయు.

శ్రీముఖుడు: బాగు! నీవు వర్తక చక్రవర్తి వనిపించుకొంటివి. నీవు చెప్పినదంతయు నాకు నవగతమైనది. మహామాత్యా! ఈవణిక్ శ్రేష్టుని యాలోచన లెస్సగానున్నది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 56 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)