పుట:Himabindu by Adivi Bapiraju.pdf/54

ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మ: ఇప్పుడు చిరంజీవికి మానసపథమున మహోత్కృష్టమగు మార్పు జరుగుచున్నదని నా తలంపు. పందెములకు బోయి నెగ్గివచ్చినాడు. బాహుబల గర్వమొందుట కంతకన్న ఏమికావలయును? దేహబలమునకు, ఆయుధవ్యాపారమునకు దగ్గరిబంధుత్వము. యుద్ధములో కీర్తిగొనుట సురాపానము నట్టిది. ఆనా డనేక బిరుదావళులు ధరించిన మేటి మగలగు శూరుల చూచినాడు. తానును జయశీలుడైనాడు. ఆ సమయము నందు వారివలె యుద్ధమున పేరుమోసి మహాసైన్యాధ్యక్షులలో నొకడేల కాకూడదు? ఈ ఆలోచన లొకపాయయై ప్రవహింప వీనికన్నిటి కతీతమై పవిత్రమై, బుద్ధదేవునకు ప్రియమై వెలుగునది, అర్హతమార్గములలో నొకటి యైనది, తానుచేయు శిల్పపుపని. ఈ రెంటికిని ఇప్పుడు సమరము జరుగుచున్నది. అబ్బాయిని మారదేవుడు పరీక్షించుచున్నాడు. ధర్మనంది ఇట్లు మాట్లాడుచు నిమీలితలోచనుడై ఒక లిప్తకాలముసర్వము మరచిపోయెను.

శక్తి: తామిట్టి సమయమం దూరకుండుట న్యాయమా?

ధర్మ: (కన్నులు తరచి) వెఱ్ఱిదానా! ఎవరియుద్ధమున వారు జయమందవలయును. “తేజోమూర్తి” కెవ్వరు సహాయము చేసినారు? చైత్యముపై నేను రచించిన మారుని కథాశిల్పము చూడలేదా? అబ్బాయికి రెండు మార్గము లిప్పుడు గోచరమైనవి. ఒకటి ప్రాపంచికము: పూలవాసనలు, సెలయేటి గానములు, నీలగిరి రూపసౌందర్యములు, కాంతామనోహరవాక్యములు, సువర్ణముల తళుకులు, నాట్యముల ధిమికిటలు, నవ్వులు హాస్యములు సుడిగాలి రీతి, సుడిగుండములవలె మనస్సును భ్రమింపజేయును. ఇంకొకటి: నిమీలిత నేత్రములు, ఆరాధనలు, ఉపవాసములు, దానములు, యాత్రలు, భిక్షులతోడి సాంగత్యము, ఇది చిత్తసమాధిగూర్చును. బిడ్డ డీ రెంటిలో దేనిని వరించునో?

శక్తి: ఎవరైన చేయూత నీయకపోయిన. అబ్బాయి పని యేమగును?

ధర్మ: ఎవరికర్మకు వారే కర్తలు. నీవు చదువుకున్నదానవు. ఈ మాత్రము తెలియదా? దశకుశలములు, అష్టమార్గములు మానవుడాచరించునపుడు, అరిషడ్వర్గముల జయించుటకు సమర్థుడు కానిచో ఏరును సహాయము చేయజాలరు. కాముడు, మోహుడు మనుష్యు నవలీలగ తమబానిస జేసికొందురు. చిరంజీవి యీ యుద్ధమున పందెములలో వలె విజయముగాంచెనా మన కులము తరించును. లేదా....

శక్తి: మన మిందు చేయదగినది లేదందురా?

ధర్మ: భగవంతుని ప్రార్థించుటయే! ఆ “విజ్ఞానస్వరూపుడు” బోధిసత్వుడు భక్తుల సంరక్షింపలేడా!

నాగ: అమ్మా! మేము మాట్లాడుటకు బోయినప్పుడు మాతోడను యథాప్రకారము పలుకలేదు. పరధ్యానము! నాల్గయిదుసారులు ఎదియోచిత్రము లిఖించబోయినాడు. అది తాననుకొన్నట్లు లేదనియో ఏమో చెరిపి వేసి ఫలక మొకమూల పారవేసినాడు.

సిద్ధార్థినిక: అమ్మా! ఒక్కబొమ్మలు వేయుటే కాదు. విగ్రహము కూడా చెక్కుట ప్రారంభించినాడు. ఒక బాలికరూపమే! కాని తృప్తి గూర్పకకాబోలు, ఆ విగ్రహమును విసుగుదలతో వేయిముక్కలు చేసినాడు.

ఇంతలో మహాలి తన చీరకుచ్చుల మడతలలో ఒక విగ్రహశిరస్సు గొనివచ్చి శక్తిమతీదేవికిచ్చి చిరునవ్వు నవ్వెను. నాగబంధునిక యా శకలవను తేరిపారజూచి “అమ్మా

అడివి బాపిరాజు రచనలు - 2

• 44 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)