పుట:Himabindu by Adivi Bapiraju.pdf/48

ఈ పుట ఆమోదించబడ్డది

నగరము, పర్వతనగరము, మహానగరముల మీదుగా మంజిష్ఠానదీతీరముననున్న గంగా పట్టణమునకుబోయి యచ్చట నుండి ప్రతిష్టాన నగరమునకు బోవును.

రెండవ మహారాజపథము ధాన్యకటకమునుండి తూర్పుగా ఇంద్ర కీలాద్రి పురమునకుబోయి అచ్చటనుండి ఆగ్నేయముగా కృష్ణానదీతీరముననే భట్టిప్రోలు పోయి, యచ్చట కృష్ణ దాటి ఘంటికాశాలకును ఆ పురమునుండి శ్రీకాకులమునకును బోవును.

మూడవ మార్గము ధాన్యకటకమునుండి దక్షిణముగా ధనదపురమునకు, నచ్చటనుండి ఉదయ పర్వతమునకు, నచ్చటనుండి కాంచీ పురమువరకు పోవును.

నాల్గవమార్గము ధాన్యకటకమునుండి ఈశాన్యముగాబోయి, వేంగీ పురము, అచ్చటనుండి గౌతమీతీరముననున్న గోతీర్థముకడ గౌతమిని దాటి దక్షిణకోసల రాజధాని, పిష్టపురమును, పూర్వాంధ్రదేశ ముఖ్య నగరమగు శాతవాహనగుండము, ఆంధ్రగిరి పోయి, అటనుండి త్రికళింగ దేశము చేరును.

చంద్రస్వామిని శిబికారోహిని జేసి శాతవాహనసైన్య దళపతియు, సైనికులును రెండు దినములలో ఇంద్రకీలపర్వతము జేరినారు. ఇచ్చట కృష్ణానది ఇంద్రకీలపర్వత పంక్తి ఛేదించి, సింహమధ్యమయై, వేగవతియై సముద్రతీర భూములైన నాగవిషయమున ప్రవహించి, ప్రాచీనాంధ్ర ప్రభువగు సుచంద్రుడు, అవతారమూర్తియగు ఆంధ్రవిష్ణువు పరిపాలించిన శ్రీకాకులపురమును పవిత్రముచేయుచు, మూడుగోరుతముల దూరమున సముద్రమున జేరును. (ఇప్పుడు కృష్ణానది శ్రీకాకులపురమునుండి పదిమైళ్ళు తూర్పుగా నదిఒండ్రుచే వెనకకు జరిగినది.)

చంద్రస్వామి ప్రయాణము చేయుచు గ్రామగ్రామమున జరుగు చక్రవర్తి జన్మదినోత్సవములు చూచుచుండినాడు. ప్రజలందరు మేకల వంటివారు. వారీనాడొక మార్గము మంచిదందురు. రేపు వేరొక పథము శుభమందురు. ఎల్లుండి మరియొక్క టందురు. వారికి నిలకడ ఎక్కడ? ఈ రోజున వెర్రిభక్తితో నాగదేవులను కొల్తురు. గ్రామ దేవతలకు నరపశువునుగూడ బలియిచ్చుటకు సిద్ధమగుదురు. రేపు బౌద్ధసన్యాసి యొక్కడు వచ్చి అహింస బోధించగనే, మాంసాహారమునైన మానుదురు. కాషాయాంబరముల ధరింతురు. నగల నూడ్చివైతురు. రెండు మూడునూరుల సంవత్సరములలో ఈ పవిత్ర భూమి యంతయు నీ చార్వాకమత మల్లుకొనిపోయినదే. యాగములు పనికిరావట, చైత్యములకు పూజలట.

మనుష్యుడు దేహము వదలిన వెనుక నేమున్నది? ఖననమై భౌతి కేంద్రియము లన్నియు పంచభూతముల లీనమైపోవలెగదా! ఉపనిషన్మత విరోధముగ బోధించి దేహము మాయయని చెప్పుచు, నా దేహమున ఎముకయు, వెండ్రుకయు, దంతము, నఖముకూడా పూజనొందవలయునని శాసించిన యాతడు అర్హతుడట, బుద్ధుడట. చితిపై గట్టబడిన కట్టడము చైత్యమట, అద్దానికి పూజలట, అది త్రిరత్నముల నొకటియట!

అని యూహించుకొనుచు చంద్రస్వామి కృష్ణానదిలో ప్రాతఃకాలముననే గ్రుంకులిడి ఉదయ సంధ్యార్చన మొనర్చి, సూర్యున కర్ఘ్యమిడి పురసత్రమున వంటయొనర్చుకొని, భుజించి మరల శిబిక నారోహించి బయలుదేరెను. సాయంకాలమగునప్పటికి వారందరు ధాన్యకటక నగరము జేరిరి.

దళవాయి కోట ఈవలనున్న ఉప సైన్యాధ్యక్షుల భవనమునకు గొనిపోయి ఆజ్ఞలనంది చంద్రస్వామిని తోటలోనికి గొనిపోయి ద్వితీయ ముహూర్తపు భేరీలు మ్రోగకముందే రాజపురోహితాశ్రమమున ప్రవేశపెట్టెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 38 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)