పుట:Himabindu by Adivi Bapiraju.pdf/300

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయ శ్రీప్రతిష్టాన నగర మహాపాలకా! జయభరుకచ్ఛపట్టణ చంద్రసైంహితేయా! జయ జయ మాళ వాభీర కుంత లాశి కాశ్మికాది నానాదేశ రాజన్య కిరీటరత్న నీరాజితసుందర శ్రీపాదుకా! జయ జయ జయశ్రీ ఆనందీపుత్ర శ్రీకృష్ణ సాతవాహన మహారాజా!” అన్న జయ వాక్యములు గంభీరస్వరమున ఆ విహారమున మారుమ్రోగి అందరు చకితులై యావంక కనుగొనిరి.

శ్రీకృష్ణసాతవాహన మహారాజు, వినయభిక్కులు, ధర్మనందియు, శక్తిమతీదేవియు, ముక్తావళీదేవియు లోనికి విచ్చేసిరి. వారివెనుకనే హర్షగోపుడు పెన్నిధిని వెదకు లోభివలె వచ్చెను. హిమబిందు వెంటనే ముక్తావళీదేవి కడకు పరువిడి యామె కౌగిలిలో వ్రాలినది. ముక్తావళీదేవి కనుల నీరు చెమరింప “నా తల్లీ!” అని ఆమెమూర్థము పుణికినది.

శక్తిమతీదేవి నవ్వుచు, “కోడలా! క్షేమమా తల్లీ!” అని ప్రశ్నించినది.

సువర్ణశ్రీ మహారాజునకు వీర నమస్కారమిడి, తండ్రికి పాదాభి వందన మాచరించి, ముక్తావళీదేవికి, తనతల్లికి నమస్కృతులిడెను.

శ్రీకృష్ణసాతవాహనుడు సంఘారామకులపతికి నమస్కారమిడి ఆశీర్వాదమందెను. ఆ మహారాజు సువర్ణశ్రీని కనుంగొని, “సువర్ణశ్రీ ప్రభు! యాత్రలన్నియు పూర్తియైనచో మిమ్ము గొనిరమ్మని సార్వభౌములు మా కాజ్ఞ నిడిరి. మిమ్ము చక్రవర్తి సామ్రాజ్యాభిషేకమునకు, మీ వివాహమునకు, మా సమవర్తిసోదరుల వివాహమునకు ఆహ్వానింప మేమే వచ్చితిమి!” అని సాభిప్రాయపూరితము లగు చూపుల పరపెను.

సువర్ణశ్రీ “మహాప్రభూ! అవధరించుచుంటిని” అని వినయముతో బలికెను.

యువరాజు “సువర్ణశ్రీ ప్రభు! చారుగుప్తులవారు తమపుత్రికను హిమబిందుదేవిని తమకు పాణిగ్రహము సలుప కోరుటకు వచ్చిరి. తమ ప్రతినిధిగ సార్వభౌములు మమ్మంపిరి. కాని మాకన్న ముందుగనే శ్రీ చారుగుప్త మహాభాగులు విజయము చేసినారు” అని దరహసిత వదనమున పలికినాడు.

సువర్ణశ్రీ “మ-మ-హారాజా!” అని గద్గదిక మొందినాడు.

శ్రీకృష్ణుడు “సువర్ణశ్రీ మహాప్రభూ! మీరు కుసుమపురమున సకల ధరాధీశేశులైన శ్రీ శ్రీముఖసాతవాహన చక్రవర్తుల రాజప్రతినిధులుగా సింహాసన మధివసింప చక్రవర్తులు మిమ్ము ఆహ్వానింప మా కాజ్ఞ నిచ్చినారు” అని గంభీరస్వరమున పలికినాడు.

మాగధులు, జయ జయ శ్రీసువర్ణశ్రీమహారాజులకు! జయ విరోధి వీరమత్తేభకుంభ విదారణకంఠీరవులకు! జయజయ శ్రీపాటలీపుత్రపురసింహాసనాధీనా! జయ జయ సకలభూమండల ప్రసర్పితశ్వేతచ్ఛత్రాధిప శ్రీ శ్రీముఖసాతవాహన మహాజాధిరాజ ప్రసాదలబ్ధ సింహాసనా!” అని జయ ధ్వానములు పలికినారు.

చారుగుప్త ధర్మనంది కీర్తిగుప్తుల హృదయములు ఝల్లుమని పోయినవి. శక్తిమతీ ముక్తావళీదేవులు ఉప్పొంగిపోయినారు.

సువర్ణశ్రీకడకు శ్రీకృష్ణసాతవాహనుడు పోయి చెవిలో “మిత్రమా! సువర్ణశ్రీప్రభూ! నాకు హిమబిందుదేవి ఎప్పుడును చెల్లెలు. నీవు వేరభిప్రాయమంది నాకు తలవంపులు తెచ్చెదవా! నా చెల్లెలు హిమబిందు కుమారి నీ అర్థాంగిసుమా!” అని రహస్యము చెప్పెను.

సువర్ణశ్రీ ఆచార్యునిపాదములకడనే సాష్టాంగపడినాడు. ఆచార్యులంతట అత్యంతదయతో సువర్ణుని లేవనెత్తి ఆతని చేతిలో హిమబిందు చేయి నుంచినారు.

అడివి బాపిరాజు రచనలు - 2

290

హిమబిందు (చారిత్రాత్మక నవల)