పుట:Himabindu by Adivi Bapiraju.pdf/295

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువురు పొదరింట అధివసించిరి. ఆ పొదరింట పూలపరీమళములలో చంద్రబాల శివజటాజూట శ్వేతపన్నగివలె స్వాతికాభిరూప యైనది. ఆమె వెనుకనే స్వచ్ఛోరగి ఉలూపి మెఱుమువలె శ్రీకృష్ణప్రభువు ఒడి లోనికి ప్రవహించి వచ్చెను.

“దేవీ! ఉలూపి ఈ దినములలో మెఱుమువలె వెలిగిపోవుచున్నది. ఆమె కింత యానంద మేమి?”

“ప్రభువు ధూర్తులగుచున్నారు. నా ఆనంద మాపన్న గరాణిది యును”

“అటులనా!”

ఉలూపి ఎటులవచ్చినదో అటులనే మాయమైనది. విషకన్యక కడకు శ్రీకృష్ణుడు చటుక్కున చేరి యామె నక్కున జేర్చుకొని నంతట మందాకిని పాలసముద్రము చేరునట్టి, రాకాపూర్ణిమాజ్యోత్స్న సుధాకరహృదయమున చేరునట్టి అమృతమధురములగు సుస్వరముల నా విషకన్యక -

“చంద్ర స్త్వం, చంద్రికాహం,
దివిజసరి దహం, భాస్వర సాగర స్త్వం,
ఏత ద్విశ్వాంబుజం త్వం
సతత పరిచర ద్గంధ సందోహికాహమ్”

అని పాడెను. ఆమె మోము హాసప్రఫుల్లమైనది. “ఇది నేను రచించు నొక రూపకములోనిది సుమండీ! ఈ శ్లోకంకూడా వినండి -

“ఏషా సేయం ధ్వని రహ మమృతౌ
త్వం మహాకాశరూపః,
ఓం త్వం, త్వం తత్, త దహ, మహ మహో
సృష్టి రేషా సమస్తా”

అని తోడిరాగిణీయుక్త మగు కాకలీస్వనమున శ్లోకము పాడినది.

శ్రీకృష్ణప్రభుని యానందము వర్ణనాతీతము.

“దేవీ! నేను హిమబిందుకుమారిని ఉద్వాహ మగుదు ననుకొని సువర్ణశ్రీ ప్రభువు వారణాసి పారిపోయినాడు. రేపు వఱువాతనే ఆయనను తోడి తే వారణాసి పోవుచున్నాను.”

విషబాల “తప్పక కొనిరండు. మీరు ప్రార్థించినగాని యా మహాశిల్పి రాడు సుమండీ!” యనెను.

20. శిల్పి-ప్రణయిని

సువర్ణ అచ్చట శిల్పగృహమున బోధిసత్వుని విగ్రహము చెక్కుచుండెను. ఆ బోధిసత్వుడు త్రిభంగిమై నిలుచుండి లీలాకమలము కుడి చేత ధరించియుండెను. సువర్ణశ్రీ తన వేదన నంతయు నా విగ్రహమున వేదనాతీతు డగు మహానుభావునియందు మూర్తింపజేసెను.

మృగాజిన యజ్ఞోపవీత ధారియై, మణిస్థగిత కుండలకర్ణుడై, విశాల నేత్రుడై, విపుల భుజాస్కంధుడై యా బోధిసత్వుడు సువర్ణశ్రీ పోలికనే వరించెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 285 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)