పుట:Himabindu by Adivi Bapiraju.pdf/292

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉన్నవనెను. పాపములు చేయువాడు హీనజన్మ మెత్తుననెను; పురుగులు, వృక్షములు, రాళ్ళజన్మముల నెత్తు ననెను. మోక్షమునకు దారి సంసారత్యాగము, కర్మరాహిత్యము, అహింస, చివరకు ప్రాయోపవేశము అనెను. ఇట్టి మతములు మనుష్యులున్నంతకాలము ఉద్భవించును. సత్యము మానవునకు లభ్యమే! అతీత మనునది మేము ఒప్పము కాని నాలో రెండు నదులు సంగమించి అనేక విచత్రమహాభావములు రూపెత్తుచున్నవి. పరమ పవిత్రమైన వేదధర్మము, బుద్ధధర్మము రెండును నాలో నిడుకొని తపస్సునకు పోదును. నే నేమి కనుగొనెదనో!

స్థౌల: స్వామీ! మీ పూర్వాశ్రమరూపమైన నాపుత్రుని ఆశీర్వదించుచున్నాను. మిమ్ము “నారాయణ” మహానామమున సాగనంపుచున్నాను. నాకు అద్భుతానందము విశ్వమునుండి సూక్ష్మాతిసూక్ష్మమై, బ్రహ్మమై దర్శన మిచ్చునున్నది. ఈ అమృతత్వమే సర్వము నిండును. అదిగో చంద్ర!

ఇంతలో స్యందన మెక్కి విషకన్య అచ్చటకు వచ్చినది. విష వైద్యులు, ఆయుర్వేదరులు, విషవేత్తలు, మంత్రవేత్తలు కూడ నుండిరి.

విషకన్య పరుగునవచ్చి తాతగారి కాళ్ళకడ సమాలింగిభూతల యైనది.

అమృతపాదుల కన్నులు చెమరించినవి. స్థౌలతిష్యు లామెను ఒడి లోనికి తీసికొని, తల్లీ! నీ దివ్యచరిత్ర విషాతీతమై ప్రేమమయమైనదా? నీ విషము అమృతమే అయినదా! నీవలన సర్వలోకములు జయింప బడినవా? తల్లీ, అరుగో ఆ మహానుభావుని ఎరుంగుదువా?” అని ఆనందమున ననెను.

విషకన్య: అమృతపాదార్హతులు, నాగురువులు తాతగారూ!

స్థౌల: వారు నీకు ఏమిగా కనబడిరి?

విష: వారిని చూచినప్పుడు నిన్ను చూచినట్లయినది. వారును, నీవును ఒకటయిరి. వా రెవరు తాతయ్యా?

స్థౌల: తల్లీ! ఆయన నీ తండ్రి, ఆ తండ్రిని చిన్నతనమున పోగొట్టుకొంటిని నే డాతడు మహర్షియై నాకడకు వచ్చినాడు.

స్థౌలతిష్యుని శిష్యుడొకడు కొన్నిమాత్రలను అమృతపాదుల కిచ్చెను. వేరొక మాత్రను విషకన్యచే సేవింపజేసెను.

స్థౌలతిష్యుడప్పుడు కంఠమెత్తి,

“శుక్రం తే అన్య ద్యజతంతే అన్వద్విషురూపేఅహనీ ద్యౌరివాసి!
విశ్వహిమాయా అవస్విధావో భద్రాతే పూష న్నిహరాతి రస్తు”

అని సూర్యమంత్రము పఠించెను. బ్రాహ్మణులందరు కంఠములు గలిపిరి.

ఇంతలో చక్రవర్తియు, శ్రీకృష్ణసాతవాహనుడు, మహారాజ్ఞి అందరును వచ్చి స్థౌలతిష్యునకు, అమృతపాదులకు నమస్కరించిరి.

విషకన్య తండ్రికడకు పోయి నమస్కరించినది. అమృతపాదు లామెను అక్కున చేర్చుకొని, మూర్థమున ముద్దిడి “తల్లీ! నీవలన నాకు బూర్వజ్ఞానము వచ్చినది. నాతండ్రి, నీ తాతగారు ప్రేమస్వరూపులైనారు. నీవు అమృతకన్య వగుదువు. నీవు ప్రేమించిన ఈ శ్రీకృష్ణమహారాజునే చెట్టపట్టుము” అని ఆశీర్వదించెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 282 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)