పుట:Himabindu by Adivi Bapiraju.pdf/285

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బండితో సమర్పింపనెంచితిని. అది ఇంకొకదారి పట్టినది. విజయమందినది సువర్ణశ్రీ! అప్పుడు భగవానుడు నాకు జరుగబోవు విషయములు సూచించినాడు. అయినను మహామత్తతతో నేను భగవంతుడననినట్లు సంచరించితిని. నేనును, తమ్మంతమొందింప సంకల్పించిన స్థౌలతిష్యమహర్షియు ధర్మముచే పరాభవ మొందితిమి. తామును, విషకన్యయు, నా హిమబిందును, సువర్ణశ్రీయు ఏ మహత్తర దివ్యసంఘటన నెరప జనించినారో ఏరికి తెలియును? మీ నలువురి ఆనందమే నా ఆనందము. తాము తథాగతుని పరమకరుణతో వర్ధిల్లుదురుగాక!

“మీ అఖండానురాగము మన ఆంధ్ర ప్రథమునకు, సాతవాహనులకు అనంతాశీర్వాదము.”

శ్రీకృష్ణసాతవాహనుడు వెడలిపోయినాడు.

వారు వెడలిపోవుటయేమి కీర్తి గుప్తులవారు, ముక్తావళీదేవియు నచ్చటకు వచ్చినారు. కీర్తిగుప్తుడును, ముక్తావళియు నలుని వందనము లందుకొని యాశీర్వదించినారు. వారందరు లోనిమందిరమున కొకదానికి పోయినారు.

కీర్తి: నాయనా!

చారు: మామగారూ! మీరు చెప్పబోవు విషయము నాకు తెలియును. మీరు వెంటనే అత్తగారితో కాశీపురము ప్రయాణముకండు. హిమబిందు వారణాసి వెళ్ళినది.

ఇంద్రగోపుడు వచ్చి సువర్ణశ్రీ మూడుదినముల క్రిందటనే వారణాసి వెళ్ళినట్లును, అతని వెదకికొనుచు హిమబిందుకుమారి, మహా రాజపథమువెంట ఆశ్వికులైన గోండు సైనికులు వెంటరా బాలనాగితో రథముపై కాశీపురము వెడలినట్లును విన్నవించినాడు.

కీర్తిగుప్తుడు అల్లునితో “నాయనా! మనము వెనువెంటనే వెళ్ళవలయును. వినయభిక్కులవారును మనతో వచ్చునట్లు చేయవలయును. ఆ పనిలో నే నుండెదను. వర్జములేకుండ బయలుదేరిపోదము. మీ అత్త గారును మనతో వచ్చును” అని తెలిపినాడు.

వారిరువురు వెంటనే తమభవనము చేరిరి. కీర్తీగుప్తుడు సముచిత వేషుడై రథ మారోహించి కోటలోనికి శ్రీకృష్ణసాతవాహనుని మహా భవనమునకు బోయినాడు. కీర్తిగుప్తుడు మహారాజును దర్శింప ననుమతి వచ్చుటయు, వారు లోనికి బోయిరి. శ్రీకృష్ణుడు సగౌరవముగ నాయన నెదుర్కొని ఆసన మధివసింప గోరి తానును అధివసించెను.

“వర్తకచక్రవర్తీ! తమ రాకకు కారణము?”

“మహాప్రభూ! సువర్ణశ్రీ రాజభక్తిచే వారణాసి పోయినాడు.”

“అదేమి స్వామీ!”

“తాము హిమబిందుకుమారిని ఉద్వాహ మగుదురని యాతడు భావించినాడు.”

“అవును. ఆతడు హిమబిందుదేవిని ప్రేమించినాడు. ఉత్తమ శిల్పి. ధీరోదాత్తుడు. అతిరథశ్రేష్ఠు డా యువకుడు. ఆత డిచ్చట నుండుట, మా వివాహమునకు ప్రతిబంధక మగునని తలపోసి వెడలిపోయినాడు.”

“ఈ విషయమే మనవి చేయవలెనని వచ్చినాను మహారాజా!”

“స్వామీ! ఇందు మా కర్తవ్య మొకటి యున్నది. మేము ప్రార్థించినగాని సువర్ణశ్రీ హిమబిందుకుమారిని వివాహమాడుట కియ్యకొనక పోవచ్చును. మీరు వెంటనే పోయి ఆ మహాభాగుడు ఏవిధమగు తొందర పడకుండ చూడుడు. మేము మీ వెనువెంటనే వత్తుము.”

అడివి బాపిరాజు రచనలు - 2

• 275 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)