పుట:Himabindu by Adivi Bapiraju.pdf/281

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిమబిందు మరల సంకేతముచొప్పున నదీతీర గ్రామమునకువచ్చిన నావ నెక్కి ఒకదినము ప్రయాణము చేసి కతిపయదినములకు వారణాసి చేరెను.

వారణాసినుండి ఆమె వెంటనే గోండులతో హరిణవనాశ్రమము చేరినది. అచ్చట ఒక అతిథిగృహమున వారిద్దరు వసించి, గోండులను సువర్ణశ్రీ ఎచ్చట నుండెనో తెలిసికొనిరమ్మని పంపినది. 

14. నూత్నాశోదయము

చారుగుప్తుని ప్రపంచము ఇసుకతో కట్టిన బొమ్మరిళ్ళవలె కూలిపోయినది. తన బాలికను యువరాజ్ఞిని చేయవలెనని ఉవ్విళ్ళూరిపోయినాడు. హిమబిందు శైశవము నాడే ఆతని నా మహాస్వప్న మావేశించెను. అందుకై ఆత డెత్తిన ఎత్తులు, చేసిన సంపాదన, రాజానుగ్రహప్రాప్తికై పడినపాట్లు లోకవిఖ్యాతి నందినవి.

ఆంధ్రచక్రవర్తి గౌరవ ప్రేమల కాస్పదుడైనాడు. చారుగుపునితో నాలోచింపకుండ నేకార్యమును చక్రవర్తి తల పెట్టలేదు.

మహారాజ్ఞకి కావలసిన విద్యలన్నియు హిమబిందునకు నేర్పించినాడు. చారుగుప్తుడు- సకలశాస్త్రములు, ఛప్పన్నభాషలు, ఆంధ్రప్రాకృతము, పాలి, సంస్కృతము, మాగధి, శూరసేని మొదలగువానిలో నామెను పండితరాలిని చేసినాడు. త్రిపీఠకములు, ధర్మచక్రప్రవర్తన సూత్రము, అభిధర్మసూత్రము, మహాపరినిర్వాణ సూత్రము మొదలగు సూత్రములు నికాయములు, జాతకగాథలాది బౌద్ధ గ్రంథము లన్నియు ఇతిహాసాది సంసృత గ్రంథములన్నియు హిమ చదివినది. అశ్వారోహణము, కత్తి సాము, విలువిద్య, రథచోదకత్వము మొదలగు విద్యలయందామె ప్రజ్ఞావంతురాలు. నాట్యము, చిత్రలేఖనము, గాంధర్వము, సాహిత్యము వీనియన్నిటి యందును ఆమె అపరప్రజ్ఞాపరిమిత, సరస్వతి.

ఇట్టి బాలికను, జగదేకసుందరిని శ్రీకృష్ణుడు తనకు వలదనినాడు. ఆ విషబాలికయే తనకు కావలెనట. రాజులహృదయములు నిలుకడలేనివి. ఋతువులలో గాలివాన లెప్పుడువచ్చునో చెప్పవచ్చును. రాజధర్మము నిర్వర్తించు వారి హృదయము లెట్లుండునో ఎవ రెరుంగ గలరు?

తన శ్రమయంతయు వ్యర్థమైనది. తన ఆశలు, తపస్సులు రిక్తఫలములు పండినవి. తనబిడ్డ సువర్ణశ్రీని వివాహమాడునట. తన బాలికకు శిల్పి యగు సువర్ణశ్రీకి నెక్కడి కెక్కడ! తాను వర్తకచక్రవర్తి. సాధారణచక్రవర్తులు తొక్కిచూడని దేశములు తాను జయించినాడు. భారత వర్ష మన నేల, సకల భూమండలమున తనతో సమాను లగు ధనవంతులు లెక్కకువత్తురో, రారో!

ధన మిచ్చి సామ్రాజ్యములు కొనగలవానిపుత్రికయై, బొమ్మలు చెక్కుకొను శిల్ప బ్రాహ్మణుని బిడ్డనా తనబాలిక వలచునది!

రాజులహృదయములకన్న మరియు విచిత్రములు, అగాథములు స్త్రీల చిత్తములు. ఎవరు తనకు సహాయము చేయగలరు? ఎవరు ఆలోచన చెప్పగలరు? చక్రవర్తి తనతోపాటు విచారించును. తన చండశాసనముచే కుమారుని ఆజ్ఞాపించి హిమబిందు నుద్వాహమగునట్లు చేతునని యాయన వాగ్దానమిచ్చినాడు. కాని ఆ బలాత్కార వివాహముచే నేమిప్రయోజనము?

అడివి బాపిరాజు రచనలు - 2

271

హిమబిందు (చారిత్రాత్మక నవల)