పుట:Himabindu by Adivi Bapiraju.pdf/267

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ స్వప్నములన్నియు విరిగి నేల కూలినవి. ఆమె భర్తను తలచుకొని, తన తల్లిని తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చినది.

లోకమున నెవ్వరికిని వెరవక తల్లికిమాత్రము వెరచు సమవర్తి తల్లి దుఃఖమును దర్శించుచు కలగుండుపడి చేష్టలుడిగి నిలుచుండినాడు.

ఆశలు, స్వప్నములు, కోర్కెలు మానవుల కుండుట సహజము. కాని అవి సంపూర్ణముగ స్వార్థపరము లయినచో మానవుడు తుచ్ఛుడై పోవును. సువర్ణశ్రీ హిమబిందును ప్రేమించెను. ఆమె తనకు గాదని తెలిసియు నామెను రక్షించెను. కోరికలేక ధర్మమార్గమున నడచు పురుషుడు వీరోత్తంసుడు. సువర్ణశ్రీ యట్టివాడు.

సమవర్తి కనులుమూసుకొనెను. తాను ప్రేమించుచున్నది నాగబంధునికను. హిమబిందు తనసొత్తు అనుకొని, ఆమె దివ్యసుందర విగ్రహమును చూచి, యామె అగణిత సంపదను ఎరిగి, యామెను భార్యగ ఊహించి, కాంక్షించి వ్యధలపాలయినాడు. నేడు అన్నియు తారుమారైనవి. ఉత్తమ ఫలవృక్షము భూమిని చీల్చికొని పైకి వచ్చునట్లు తన స్వార్థమును చీల్చి నాగబంధునికా ప్రేమ వెడలి తన జీవితదిశలు క్రమ్ముకొనిపోయినది. ఇప్పుడు తల్లి ఏమనునో, ఏమియాజ్ఞ నిచ్చునో?

వినయభిక్కు లేచి కొమరిత మూర్ధముపై హస్తము నిడి, “తల్లీ! భగవాన్ సమంతభద్రుడు మానవలోకమున కిచ్చిన యుపదేశములు నీయెడల నిష్ఫలము లగుటయేనా?” యనినాడు.

సమవర్తి తలవాల్చి క్రుంగి కూర్చుండియున్నాడు. ఆతని తీక్షణముగ చూచినది ఆ తల్లి. ఆమె కన్నులు చెమరించినవి. అమృతలత చిరునవ్వున “నాయనా! నాకు సర్వమును నా తండ్రి ఈ బాలుడే! వాని యానందమే నా యానందము. కానిమ్ము, అన్నియు నీవే ఏర్పాట్లు చేయుము. (కొమరుని కడకుపోయి) నాయనా! నీవు వీరాగ్రగణ్యుడవు. నీ తండ్రిగారి పేరు నిలబెట్టిన ఉత్తముడవు. నీకు పారితోషికముగా నీ హృదయేశ్వరినే నే నర్పింతును” అని పలికినది.

వినయభిక్కునకు వారిరువురు పాదాభివందన మాచరించిరి. ఆతడు వారి నాశీర్వదించి, అమృతపాదులను దర్శింప వెడలిపోయెను.

కొన్నినాళ్ళయిన వెనుక శక్తిమతీదేవియు, మహారాణి ఆనంద దేవియు, మహామంత్రి భార్యయు, ఇతర నారీమణులతో, పరిచారికలతో సమవర్తీ పాటలీపుత్రమున వసించు భవనమునకు వేంచేసిరి. అమృతలత యానందమున వారిని సర్వమర్యాదల నెదుర్కొని ఉచితాసనముల గూర్చుండ చేసెను.

మహారాణి: అక్కగారూ, మేము మీకడకు వివాహ రాయబారమున వచ్చినాము.

అమృతలత: మహారాణీ! తాము స్వయముగ మా ఇంటికి విచ్చేయుట మాకందరకు తులలేని గౌరవమొసంగుట, సెలవీయండి సామ్రాజ్ఞి!

మహారాణి: శక్తిమతీదేవి, తమ పుత్రికను శ్రీ సమవర్తి ప్రభువునకు సమర్పింప తమ యనుమతివేడ వచ్చిరి.

ఆంధ్రమహారాణులు, మహారాజులు, ఏవిషయమును తాము స్వయముగ మాటలాడరు. వారి ప్రతినిధులు వచ్చి విషయములు ఏర్పాటుచేయుదురు. ఇప్పుడు ఆంధ్రసామ్రాజ్ఞి తానే స్వయముగ రాయబారియై వచ్చుట తనకెంతయో గౌరవమని అమృతలత ఆనందమందెను. అమృతలత తన కా సంబంధము ఎంతయో

అడివి బాపిరాజు రచనలు - 2

• 257 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)