పుట:Himabindu by Adivi Bapiraju.pdf/246

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపాయము తట్టినది. మనము పాటలీపుత్రమును పట్టుకొనవలెనన్నను, గంగాదేవియే మనకు ఉపకరించవలెను. గంగాదేవి మార్గము చాలకష్టమైనను ఆ తల్లిని మనకు తోడ్పడ చేసికొన్నచో పాటలీపుత్రనగరము పది ఝాములలో మనకు హస్తగత మగును.”

“చక్రవర్తి సైన్యనష్టము ఎక్కువకాకుండ కోటను పట్టుకొనవలె నని ఆదేశించినారు. అమృతపాదులవారు ఇట్టి జననష్టము భగవత్ప్రీతి కరముగాదని, నిర్వాణదూర మని వాదింతురు. నీ ఉపాయము జననష్టము తక్కువగు ఉపాయమై ఉండవలెను.

“మహారాజా! ఇంతవరకు గంగ అవతలికోటను మనము పట్టు కొనలేదు. ఆ కోటను పట్టుకొనునట్లు వేలకొలది సైన్యము దానిని చుట్టు ముట్టవలయును. ఇంతవరకు గంగానదిలోని పడవలు మనకు వేయికన్న ఎక్కువలేవు. నే నీ మధ్య గంగానదికి ఎగువను, దిగువను ప్రయాణము చేసి రెండువేల పడవలను మూల్య మిచ్చి కొని తీసికొచ్చినాను. ఇవి కాక ఈ పరిసరములనున్న గ్రామము లనేకములు తిరిగి చిన్న చిన్న అడవి బూరుగుచెట్లు, బాడితచెట్లు మూల్య మిచ్చి నాల్గయిదువేలు కొన్నాను. ఇవి యన్నియు బండ్లుకట్టి మనశిబిరములకు ఆయా గ్రామవాసులు తీసికొనివచ్చుచున్నారు. ఈ వృక్షము లన్నియు తెప్పలుగా కట్టి గంగానదిలో వేయవలెను. ఈ తెప్పలపై, పడవలపై నదిని దాటుటకు వేలకొలది సైనికులు సిద్ధముగ నుండవలయును. ఆ సైనికు లందరు మాళవ సైనికుల సంకేతము లెరుగవలెను. వారికి మహాబలగోండుడు సాయ ముండును.”

“ఈ ఆర్భాట మంతయు నెందులకు?”

“మనము మాళవదండు నొకదానిని పాటలీపుత్రములోనికి చొర నీయవలెను. వారివెంటనే మాళవవేషములనున్న మనవారు చొచ్చిపోవలెను. వారివెంట తక్కిన ఆంధ్రసైన్యములు మనసంకేతముల తెలుపు కొనుచు నగరములోనికి చొచ్చిపోవలెను. ఈలోన భూమివైపు సైన్యములవారు కోటగోడలు ముక్కలుచేయుటకు ప్రయత్నముచేయుచు న్నట్లు సంరంభము చేయుచుండవలెను. ఒకసారి లోనికి సైన్యములు పోగానే....”

“పట్టణము రెండు గడియలలో మన వశమగును. స్థౌలతిష్యులు వచ్చినప్పటి నుండియు మాళవసైన్యములు, పాటలీపుత్ర సైన్యములు కూడ విజృంభించినవి. నీ ఉపాయము మంచిదే. లోనికిపోవు దండునకు నాయకులుగా నీవును, మీ గురువు సోమదత్తాచార్యులు, సమవర్తి కుమారులును, మహాబలగోండుడు నాయకుడుగా ప్రభాతశూరుడు, ఆనందవసువు, చంద్ర కేతుడు, గుణవర్మ, శతస్కంధుడు, ప్రమానందుడు మొదలగు ఉపనాయకులు వెళ్ళుడు. కాని అతిజాగరూకతకలిగి జయము సముపార్జించ వలెను.”

“మహారాజా! అందరు నాయకులు, ఉపనాయకులు ఈ మధ్యాహ్నము తమ సమాలోచనామందిరమున కలుసుకొన ఆజ్ఞ ఈయ కోరు చున్నాను.”

“మంచిది, సువర్ణశ్రీ! మంచిది. మీమ్మందర ఇచ్చటకుజేర్ప చారులు ఆజ్ఞలు పట్టుకొనివత్తురు. ఈ విషయము సంపూర్ణముగ సమాలోచనచేసి, ఎవరే పనిని, ఏ సమయమున, ఎచ్చట ఏ విధముగ నిర్వర్తింపవలయునో నిర్ణయించుకొనిగాని, కార్యనిర్వహణమునకు దిగకూడదు.”

సువర్ణశ్రీ మహా సైన్యాధ్యక్షుని కడ సెలవుపుచ్చుకొని, తన హయ మధిరోహించి శిబిరమునకు బోయెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 236 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)