పుట:Himabindu by Adivi Bapiraju.pdf/239

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆమె నీటినుండి వెలువడి వచ్చి రెక్కలు చాచి ఎగిరిపోవు కొదమ రాయించవలె నుండెను. ఆమె యజ్ఞశాలలో ఋత్విజుల సువర్ణపాత్రనుండి యాజ్ఞాగ్నిలో నొలుకు సోమరసధారవలె నుండెను.

ఆమె ఆకాశమహాపథాల అఖండవేగమున తేలిపోవు తారకను వెన్నంటు కాంతి ప్రవాహమువలె నుండెను.

ఆమె ధరించిన బంగారు రంగువస్త్రములు, దివ్యదుకూలమును, ఆమె స్వర్ణ కరవీరపుష్పములు తలలో ధరించి, కేశభారమును ఊర్థ్వశిఖా స్వరూపమున ముడిచి యుండెను.

ఆమె మోము కొలనై, ఆమెకన్నులు అరమూతసోగలై, ఆమె నాసిక సమదీర్ఘమై, ఆమె చెవులు బంగారుమేఘాల తరకలై నవి.

ఆమెలోని శాంతి మోహినీదేవీ హస్తాం చితామృతకలశము. ఆమె లోని ప్రేమ పారిజాతసుమగర్భ కింజల్కము.

కాండవీణ తీగల స్పందించు నామె హస్తాంగుళులు పూర్ణిమనాడు గగన మధ్యమున సంయోగమందు సూర్యచంద్రకిరణాలు.

ఆ తంత్రీ విసుర్ము కస్వరమున మేళవించి యా బాలిక :


నీవుగలుగు టాత్మనమ్మి
నిలిచితి పూజాగృహమై
పన్న గేంద్రభూష! నాకు
నిన్ను చూచుచుంట ముక్తి....
ఎన్ని రూపులో వహించి
ఏగుదెంచు ని న్నెరుగక!
తలవాకిలి యోరజేసి
నిలిచియుంటి నీ కొఱకై.... నీవు....
నిన్ను పూజ సేయు టదియె
నీకు సేవ సలుపు కాంక్షె
వరము, జన్మఫలము నాకు
పరమయోగ మదియె నాథ!....నీవు....

అని పాడినది.

ఈ బాలిక నెట్లు తాను విడిచియుండగలుగును? తనకు రాజ్యములేల, యువరాజత్వ మేల, ఈ బాల తనరాణి కానిచో? ఈ బాలికామూర్తితో నిండిన తన హృదయమున వేరొక్కబాలిక రాణి ఎట్లగును? హిమబిందుకుమారి తన చెల్లెలు మాయదేవివలెనే కానుపించును దనకు.

తండ్రికి తా నేమి ప్రతివచన మీయగలడు? తాను చారుగుప్తుని మో మెటు చూడగలడు? తనకు రాజ్యమే వలదు. మంజుశ్రీ రాజగుగాక! రాచపుట్టువు ఇంతటి పరతంత్రమా? వారు ప్రేమింపకూడదా? రాముడు సీతను ప్రేమించి యుద్వాహము కాలేదా? దశరథాదులు రాముని బలవంత మొనరించిరా? బోధిసత్వుడైన సిద్ధార్థుడు యశోధరాదేవిని కోరి తన అర్ధాంగిని చేసికొనలేదా?

అడివి బాపిరాజు రచనలు - 2

• 229 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)