పుట:Himabindu by Adivi Bapiraju.pdf/226

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తమ సైన్యమునకు ఏడుగోరుతముల దూరమున శ్రీకృష్ణసాతవాహనుడు మాహానంభ్రమముతో విరోధుల తాకి, విరోధిప్యూహములోనికి చొచ్చుకువచ్చుచున్నాడని తెలియగనే సోమదత్తుడు సువర్ణశ్రీని పిలిచి “నాయనా! నీస్థానమున శతస్కంధు డుండును. నీవు పోయి మహారాజున కంగరక్షకాధిపతిగ పనిచేయుము. మాకు దారిలో చారులవలన తెలిసిన యుదంతమంతయు సమాలోచింపగా స్థౌలతిష్యులవారు, మాళవులు, శివస్వాతి, సుశర్మ, శూరసేనపతి మొదలగువారు కుట్రపన్ని సార్వభౌముని, శ్రీకృష్ణసాతవాహన మహారాజును మడియించి, మంజుశ్రీకుమారుని ధన కటక సింహాసన మెక్కించి, బౌద్ధధర్మమును నాశనముచేసి, వేదధర్మమును తిరిగి నెలకొల్ప నెంచుచుండిరి. ఈవార్త చక్రవర్తికి వేగుపంపినాను. నీ వా కుట్రను ఛేదించి ముక్కలు చేసినావు. సామ్రాజ్ఞి ఆనంద దేవి నిన్నెంతకొనియాడునో! ఆమెకు మంజుశ్రీ యనిన అంత ప్రేమ. మంజుశ్రీ నెచ్చట దాచినావు?”

“గురుదేవా! ఇది మీ ఆశీర్వచనము. మహాబలగోండుని సాహాయ్యము లేనిచో నేను కాలు కదల్చలేకపోయెడివాడను. హిమబిందు నిక్కడకు పదునొకండు గోరుతముల దూరముననున్న గ్రామమున నుంచినాను. అయిదువేలగోండు లా గ్రామమును కాపాడుచున్నారు. ఆ గుహలో దొరికినవారినందరిని చావగా మిగిలినవారిని బద్దులచేసి గోండువనమున పంపితిని. రాజకుమార శ్రీశ్రీ మంజుశ్రీని దాదులతో, బ్రాహ్మణులతో, బౌద్ధ సన్యాసులతో ఎనిమిదివేల గోండుల రక్షణమున హిమబిందున్న గ్రామమునకు రెండు గోరుతముల దూరమున వేరొక గ్రామమున నుంచితిని. నేను మూడు నాలుగు దినములకొకసారి అచ్చటికిపోయి, అన్నియు విచారించి రాజబాలకుని వినోదపరచి వచ్చుచుంటిని. నిన్ననే వారాబాలుని హిమబిందు ముక్తావళీదేవులకడకు కొనిపోయి యుందురు.

“మొదటినుండియు హిమబిందు ముక్తావళులకడనే యా ప్రభువును ఏల పెట్టితివి కాదు?”

“మొదట హిమబిందు ముక్తావళుల రక్షించి రక్షకులతో నా గ్రామము చేర్చినాను. పిమ్మట ఆ గుహను గోండుల సహాయమున పట్టు కొనగ నందు మంజుశ్రీ దొరికినాడు. ఆ బాలుని ఉజ్జయినీ ప్రాంతముల శ్రీప్రానదీతీరముననున్న స్థౌలతిష్యులవారి యాశ్రమమున పెంచుచుండిరట. శాతవాహన సేనాధిపతియగు సమవర్తి ఉజ్జయిని చేరినవెంటనే శత్రువులు మంజుశ్రీని గొనివచ్చి ఆ గుహలో నుంచినారట. ఆ బాలకు డెవరో హిమబిందునకు, ముక్తావళీ దేవికిని తెలియదట. ఆతని పెంచు బ్రాహ్మణి వలన నంతయు వింటిని. ఆమె చంద్రస్వామికి చెల్లెలట. మీరెరుగుదురు కాదూ ఆ చంద్రస్వామిని?”

“ఆ ఎరుగుదును. ఎంత అద్భుతమైన కుట్రచేసినారు! సరే, నీవు వెంటనే పోయి, నా ఆజ్ఞగా శ్రీకృష్ణసాతవాహన మహారాజునకు అంగరక్ష కాధిపత్యము వహింపుము. శుభవార్తలన్నియు ప్రభువుతో చెప్పుము.”

సువర్ణశ్రీ వెంటనే చుట్టుదారుల శ్రీకృష్ణసాతవాహనుని చేరబోయెను. శ్రీకృష్ణ సాతవాహనుని మహారాజును కలిసికొని వీరనమస్కారమిడి, సోమదత్తులవారి భూర్జపత్ర మందించెను. ప్రభువా పత్రము నామూలముగ చదువుకొని, సువర్ణశ్రీని ఏనుగుపై నెక్కించుకొని గాఢముగ కౌగిలించుకొనెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 216 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)