పుట:Himabindu by Adivi Bapiraju.pdf/211

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 గూఢపురుషుల వెంటనే పంపి ఎవరు హిమబిందు నెత్తుకొనిపోయిరో కనుగొని ఆ ముష్కరుల నాశన మొనరింపు మనుము. మన ఇంటికడనున్న యాదార్హవవర్ణు లేల ప్రమత్తులై ఇట్టి మహాహాని నాకు సంభవింపజేసిరో కనుగొమ్మనుము. అట్టి ప్రమత్తులను నేను వచ్చువరకు కారాగారమున నుంచునటుల ఆజ్ఞల నంపుము. ఇదిగో నా వేలిముద్ర. పో!” అని ఆనతిచ్చెను.

ఇంద్రగోపుడు వేగముగ వెడలిపోయెను. చారుగుప్తు డంత తన మామగారి తండ్రికి, వణిక్కుల శక్తులన్నియు నుపయోగించి హిమబిందెక్కడ నున్నదియు కనిపెట్టి ఆమెను రక్షింప వీళ్ళన్నియు చూడవలెనని గజసందేశహరులను బంపెను.

వేగవంతులు, ప్రజ్ఞావంతులు నగు గజసందేశహరులు మాళవ, మగధ, సౌరాష్ట్ర, కుంతల, విదేహ, విదర్భాది దేశములనున్న వణిక్సానము లన్నిటికి జని చారుగుప్త వణిక్సార్వభౌముని సందేశము నాజ్ఞగా విని పించిరి. 

17. స్కందావారము

మహాప్రవాహ మతివేగముగ వచ్చి కొండపై బడినట్లు, ఫెళఫెళార్భటుల దావానలము భయంకరకాంతారమును పొదివినట్లు, వర్షసమ్మిశ్రిత ప్రచండ ఝంఝానిలము వటవృక్షమును తాకినట్లు ఆంధ్ర సైన్యములు వచ్చి పాటలీపుత్ర మహాపురమును ముట్టడించినవి.

పాటలీపుత్రమున కొకవైపు గంగానది ప్రవహింపుచున్నది. తక్కిన మూడువైపుల గంగాజలములు నిండిన కందకము, ఆకాశము నంటు కుడ్యములున్నవి. కోటచుట్టు అయిదు వందల డెబ్బది బురుజులున్నవి. నదిచుట్టినవైపు మూడుగోరుతములు పొడుగుగాక, భూభాగముపై ప్రసరించిన నగరమహాకుడ్యము తొమ్మిది గోరుతముల పొడుగున నున్నది. నగరపుకోటకడకు వెళ్ళుటకుముందు, కోటచుట్టు ఎనిమిది చిన్నకోట లున్నవి. గంగానది యావలియొడ్డున నొకటియు, పట్టణమువైపు కుడ్యముల చుట్టును ఏడుకోటలు, నగరకుడ్యమునకు అర్ధగోరుతము దూరము చొప్పున నున్నవి. గంగానదివైపు ఇరువది గోపురములు, తక్కిన భూభాగమువైపు నలుబదినాలుగు గోపురమహాద్వారము లున్నవి. అశోకచక్రవర్తి నగరకుడ్యముచుట్టు కట్టిన ఏడుకోటలకు మహాకుడ్య మొకటి కలిపి, దానిచుట్టు శోణానదినుండి ఒక పాయను కొనివచ్చి పాటలీపుత్రమునకు దిగువను గంగానదిలో కలిపినాడు.

సుశర్మచక్రవర్తి ఈ కోటలన్నియు బాగుచేయించినాడు. కుడ్యములన్నియు బాగుచేయించినాడు. పట్టణమున నున్న కోటబురుజులు, గోడలు, పట్టణ మధ్యమున గంగానదీతీర ముననున్న సార్వభౌమదుర్గము, దుర్గముచుట్టునున్న కందకము అన్నియు బాగుచేయించినాడు. నగరమునందు ధాన్యాది ఆహారపదార్థములు సేకరించినాడు. ఎన్నియో యాయుధ విశేషములు, కోట గోడలనుండి శత్రువులపై కళపెళ కాచిపోయుటకు అవిసి మొదలగు నూనెలు, ఆయుధ యంత్రములు సేకరించినాడు.

ఆంధ్రులు పాటలీపుత్రము పై ఎత్తివచ్చెదరని యాతడు కలనైన ననుకొనలేదు. తనకున్న లక్షయేబదివేల సైన్యములో లక్షసైన్యము మాళవమునకు బంపినాడు. నేడా సైన్యము వచ్చుటకు వీలులేదు. లిచ్ఛవులు బౌద్ధులు. తన చుట్టునున్న దేశములవారందరు

అడివి బాపిరాజు రచనలు - 2

.201.

హిమబిందు (చారిత్రాత్మక నవల)