పుట:Himabindu by Adivi Bapiraju.pdf/210

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారు: మహాప్రభూ! వార్త తటాలున వినుటచే నామనస్సు కలత నందినదిగాని మరేమియులేదు. శ్వేతకేతులవారు చెప్పినది తప్పక జరుగునని నాకు తెలియును. ధర్మప్రేరితులమై, చక్రవర్తిని సకలభూమండల చక్రవర్తిగా పాటలీపుత్రసింహాసనమెక్కు డని మనము కోరియుంటిమి. అది జరిగితీరవలయును. నా బాలిక నాకు ఎంత ముఖ్యమో ఇదియును అంతముఖ్యము. మనకు పాటలీపుత్రమే గమ్యము.

మహామంత్రి: చారుగుప్తులవారూ! ఈ సాయంకాలములోపుననే మహాభాగు డగు శుకబాణునకు “హిమబిందు రక్షణకై మీరు పూనవలసిన” దని సందేశమంపుదము.

చక్ర: ఈ ఆలోచన ఎంతయు సమంజసము. స్థౌలతిష్యుల దుర్నీతి మితిమీరిపోవు చున్నది. ఆ ముదుసలి బ్రాహ్మణు డేమి సంకల్పించెనో?

మహామంత్రి: ప్రభూ! మీ పాలనమున మనదేశమఁతయు బౌద్ధ ధర్మపూర్ణమై ప్రజల నీతిదూరుల చేయుచున్నదట. మంజుశ్రీ కుమారులను గద్దె యెక్కించుట కాతడు పూనెను.

చారు: అట్టి ఆలోచన లాయనకున్నవని నాకును తెలియును. కాని ముక్కు పచ్చలారని నాబిడ్డ నెత్తుకొనిపోవుట యేటికో!

మహామంత్రి: మీ రాంధ్రదేశమున నొక మహాసంస్థ. శ్రీసార్వభౌముల శక్తివెనుక మీ అపార అర్ధబల మున్నదట. హిమబిందును ఎత్తుకొనిపోవుట మిమ్ము నీరసింప జేయుటకై యుండును.

చారు: ఆమెను వా రేమియు చేయరుకదా! మహామంత్రులవారూ?

చక్ర: వర్తక చక్రవర్తీ! మీతనయ కేమియు భయములేదు. మే మీ దినముననే ధాన్యకటకమునకుగూడ వేగు పంపెదము. అచ్చటనున్న సర్వసైన్యమును ఆమె యుండిన తావు కనుగొని రక్షింపవలయునని.

చారు: కృతజ్ఞుడను మహాప్రభూ!

చక్ర: ఇందు కృతజ్ఞులు కాదగిన దే మున్నది? ఆంధ్రచక్రవర్తియే మీయెడ కృతజ్ఞుడు.

చారు: అటు లనకుడు ప్రభూ! దాసునిసర్వస్వము ప్రభువుదే కదా!

అందరు చారుగుప్తునికడ సెలవు నంది వెడలిపోయిరి. చారుగుప్తుడు చక్రవర్తి వెడలిపోవునప్పుడు లేచి నమస్కరించి, గూడారము గుమ్మమువరకు సాగనంపి వచ్చి మంచముపై వాలిపోయెను. శ్వేతకేతులవారు చారుగుప్తుని జాగ్రతగా పరిశీలించి చూచుచుండిరి.

ఎందుకు తన బాలికను చోరులెత్తుకొనిపోయినారు? తనతో తీసి కొనివచ్చి యుండిన ఎంతయు బాగుండియుండును. తా నా బాలికను ఇంటి కడ వదలివచ్చి ఎంత తెలివి లేని కార్యము చేసినాడు! తనముద్దుబిడ్డ ఎంత భయమందిపోవునో? ముక్తావళీదేవికూడ నుండుటవలన కొంతధైర్యముగా నుండును. ఆమెను యువరాజున కీయ దలచుకొనుటను శత్రువులు గ్రహించినారా? నిజముగ నిది స్థౌలతిష్యుని పనియేనా? లేక ధనమున కాశించి ఏ తుచ్చులయిన నిట్టిపనిచేసినారా?

ఈ ఆలోచనలు తన్ను కలచివేయ, “ఇంద్రగోపా!” యని పిలిచెను. ఇంద్రగోపుడు పరువిడివచ్చెను.

“ఓయీ! నీవు నాస్వంత సైన్యమునకు అధిపతి యగు విజ్ఞాన కంఠీరవునకు నా ఆజ్ఞగ తన సైన్యములోని మాయాశీలురు, దక్షులగు యాదార్హవర్ణుల, అపకృష్ణుల,

అడివి బాపిరాజు రచనలు - 2

• 200 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)