పుట:Himabindu by Adivi Bapiraju.pdf/201

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నది కావలనున్నది. ఇచ్చటి నుండి రహస్యవచనము “ఉజ్జయిని!” నేను మరల వచ్చునప్పటికి మీరిరువురు లోనికిపోయి, వారిని మాటలాడక బట్టలు సర్దుకొనుడని చెప్పుడు. “ఉజ్జయిని!” మరువకుడు. జయ జయ శ్రీ శ్రీ శ్రీ కాణ్వాయన సార్వభౌమ!”అని మాగధిలో పలికెను.

ఆ ప్రతీహారిణి గుండెజల్లు మన నేదియో విచిత్ర మూహించుకొనినది. తాము సుశర్మకాణ్వాయనచక్రవర్తికడ ప్రతీహారిణులని చక్రవర్తి సందేశ హరు డీ యువకవీరు డెరిగియుండును అని ఊహించుకొన్నది.

“ప్రభువు ఆజ్ఞ ఏమి?”

“ఈ బాలికను ప్రభువే వివాహమాడునట! ఈ బాలిక చారుగుప్త తనయ. వణిక్సార్వభౌముని అట్టి బాలికను వివాహమాడిననాడు ఆంధ్రదేశము చక్రవర్తిదే! వీరందరికి ఈ రహస్యము తెలియదు. వీరికి తెలియకుండ అనగా మాళవులకు, ఆంధ్రులకు తెలియకుండ, మన మీబాలికను సౌరాష్టమిషచే పాటలీపుత్రము చేర్పవలెను.”

“మేము, మాళవస్త్రీ లిరువురు వచ్చువరకు కదలకూడదు కదా?”

“అవును, నాకు తెలియును. నీవును ఆ వనితయు ఊరకుండుడు, మీరు వారివెంటనే నాతో గుహలోనికి ఒక్క క్షణములో పరుగున రండు. మనలను మాళవులు, ఆంధ్రులు అనుమానింపగూడదు!”

“అయినచో చక్రవర్తి వేలిముద్ర చూపుము. అదిగదా నాయాజ్ఞ!”

“అవునవును! లోనికిరా! దీపపు వెలుతురున చూపెదను. నీకు ఆంధ్రము వచ్చునా?”

“రాదు.”

“అయ్యయో! సరే, నేను వారితో రెండుమాటలాడెదను. నీకు ఉంగరము చూపెదను. నీ వీ లోన నీ తోటియామెకు విషయము బోధింపుము.”

అని సువర్ణశ్రీ లోనికి విసవిసబోయి, గుహను రెండుగదులుగా విభజించు తెరను ఒత్తిగించి, ముక్తావళీ దేవిని చూచి తన నోటి పై కుడి చేయి వ్రేలుంచుకొని ఎడమచేత మాటలాడవలదని సైగచేసి, తాను సువర్ణ శ్రీనని యామె చెవిలో నూదెను. ఆమె కెవ్వున కేకవేయబోయి, నోట ఉపవీతపు కొంగును కుక్కుకొనెను. దూరమున ప్రక్కపై పండుకొని యుండిన హిమబిందు తేరిపార చూసి, “ఓ” యని యరవబోయి, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము కలదికాన, మాట లణచుకొని, మంచమునుండి లేచి పరుగున వచ్చి, యాతని భుజములు పట్టి, మొగములోనికి తీక్షణముగ చూచి యాతని చిరునవ్వు గమనించి, “అమ్మయ్యా!” యని యాతని కౌగిలింతలో కరిగిపోయెను.

ముక్తావళీ దేవికి సంతసము, ఆశ్చర్యము ఒక్కసారి జన్మించినవి. సువర్ణశ్రీ వెంటనే యా కౌగిలిలోనే హిమబిందు చెవిలో “మీ ఇద్దరు ఆ రక్షక స్త్రీల వేషముతో నాతో రండు. వారిని లోనికి రప్పించి కట్టివేసెదను. అంతయు నీపై నాధారపడియున్నది. హిమబిందూ! నేను ఒక బాలికను కట్టగనే నీవు పోయి రెండవ బాలికను కొనిరా. మామ్మగారు రక్షక స్త్రీ వేషము వేసుకొనుచుందురు” అని మరుమాటలాడక, ఆమెను కౌగిలి నుండి వదలి, గుండె దడదడ మన గాలిలో నడచుచు, తెరయీవలికి వచ్చి మొదటి ప్రతీహారిణిని లోనికి రమ్మకి సంజ్ఞ యొనర్చెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 191 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)