పుట:Himabindu by Adivi Bapiraju.pdf/190

ఈ పుట ఆమోదించబడ్డది

భయంకరారణ్యము చొచ్చిరి. ఆ ప్రదేశము మృత్యుదేవత విహరించు ఉద్యానవనభూమివలె నుండెను. భయ మనునది ఎరుగని శ్రీకృష్ణసాతవాహన భద్రదంతావళము “మందరాద్రి” యను పేరుగలది ముందునకు అడుగువేయుటకు జంకి ఆగిపోయెను. ఏనుగు లన్నియు నాగిపోయినవి. శ్రీకృష్ణసాతవాహనున కేదియో వివశత్వము కలిగినది. మావటీల నాయకుడగు మంద రాద్ర్యాధోరణుడు ఏలనో గజగజ వడంకెను.

విషవైద్య, మంత్రవైద్యులు వెంటనే తమ గజము నాపి, తాము దిగిరి. మంజూషలో నుండి విషవైద్యుడు ఒక కరండము తీసి, యందు కొన్ని చూర్ణములు వడివడిగా బోసి, చెకుముకి వెలిగించి యా చూర్ణమంటించెను. ఆ కరండమునుండి నల్లటి దూపములు ఘాటైనవి పొగమంచువలె పై కెగసినవి. ఆ కరండమును బట్టుకొని యా విషవైద్యుడు ఎండిన యా ముళ్ళపొదలో ఎటులనో దారిచేసుకొనుచు ముందునకు దూలుచున్న భద్రదంతావళము కడకు బోయెను. అందరికి తుమ్ములు, దగ్గులు వచ్చినవి. ఆ ప్రదేశమంతట నావరించియున్న భయంకర విషవాయువు ఈ పొగలచే సమసిపోయినది. మందరాద్రియు, మావటివాడును, శ్రీకృష్ణసాతవాహన మహారాజును మత్తుతెలిసి ప్రకృతిస్థులైరి.

మహారాజు: ఏమి ఈ విచిత్రము?

విషవైద్యుడు: ప్రభూ! ఈ ప్రదేశమంతయు భయంకర విషగంధ సమ్మిశ్రితమై యున్నది. సర్వవిషనాశకమగు ఈ దివ్యచూర్ణ మొక్క హాలాహల కాలకూటవాయువులదక్క తక్కినవిష వాయువుల నన్నిటిని సమయించును. తామును, మావటీడును, తమ మహాగజమును తూలిపోనారం భించితిరి. నాకును ఆ విషవాయువు తగిలినది. వెంటనే మా ఏనుగుపై వారమందరము “అమృతరస” మను నీ మందును మాత్రలుగా సేవించి, ఏనుగు నాపి, దిగి ఈ పనిని చేసితిని.

అప్పుడా భద్రదంతావళము భూమిపై నధివసింపజేసి శ్రీకృష్ణసాత వాహనుడును గజావరోహణ చేసెను. ఇంతలో పాములవాండ్రు, కిరాతులు మొదలగువార లనేకులా ప్రదేశముకడకు వచ్చుచు దూరముననే యాగిపోయిరి. అందొక్క పాములవాడు “హో” యని కేక పెట్టి యుచ్వైసనమున నిట్లు చెప్పినాడు.

“ఏలినవారు ఉన్నది మహావిషపుగాలులు వచ్చే ప్రదేశం. ఆ చుట్టు ప్రక్కలనే, అదిగో ఆ విధముగ ఆగి, వింతబడి చూచుచున్న ఆ పాపఱేని నివాసము ఉండి ఉండవలె. లేకపోయిన దొరా! అంత చావుగాలి రాదయ్యా” అని చెప్పినాడు.

“ఇప్పుడేమి చేయవలె?” అని విషవైద్యు డరచినాడు.

“స్వామీ! ఆ పొగలు బాగుగా వేయండి. మేమందరము అచ్చటికే వచ్చుచున్నాము” అని ఆ పాములవారిలోఁబెద్ద పెద్దకేక వేసి చెప్పెను. వారంద రచ్చటికి దారిని సరిచేసుకొనుచు వచ్చిరి. ఈలోన ధూపకరండము లయిదారింటిలో విషనాశక చూర్ణము పొగలువేయబడినది. రాజకుమారుడు, పాములవాండ్రు, కిరాతులు, విషవైద్యగురువు, మంత్రవైద్యుడు మాత్రము కాలినడక నా పన్నగేంద్రమును వెంటనంటిరి.

“అమృతద్రావక” మను ఒక మందు స్ఫటికశిలలో దొలచిన కలశములో నుంచిన దానిని విషవైద్యుడు వలిపెములపై పోసి తడిపి, ఆ వలిపెముల ముక్కలు అందరి ముక్కులకు కట్టి తానును కట్టుకొనెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 180 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)