పుట:Himabindu by Adivi Bapiraju.pdf/185

ఈ పుట ఆమోదించబడ్డది

ఆమెకు గజ గజలాడు చలి వచ్చినది. ముడివేసియున్న జటాభారము నామె విదలించి నది. అందమగు మంచు శిఖరమును కప్పివేయు నీల మేఘములవలె ఆమెతలకట్టు పాదములవరకు నల్లగా ప్రవహించి ఆమెను ముంచి వేసినది. ఒత్తుగా తన శిరోజముల నొడలంతయు గప్పుకొని ఆమె నిశ్చేతనయై కూలబడినది.

మరల మెలకువ వచ్చునప్పటికి సూర్యకిరణములు తీక్షణముగా నా యాకు జొంపముల నుండి లోనికి జొచ్చివచ్చి యామె నాస్వాదించు చున్నవి. ఆ బాలిక లేచి కూర్చుండి “నే నిక్కడనున్నానేమి? ఏల వచ్చినాను? ఎప్పుడు వచ్చినాను? ఎవరు తీసుకొని వచ్చినారు? నే నో వేళ చనిపోయినానేమో! ఇది యమలోకములో నొక భాగము కాబోలు! పూజ్యపాదులగు తాతయ్యమాటకు ఎదురాడినాను. వారి కోర్కె నెరవేర్చలేదు. వారి శాపమే నాకిట్లు తగిలినది. అప్పుడే యమకింకరు లీ యమలోకమునకు గొనివచ్చినారు. నే నిప్పు డేమి చేయుదును? అదిగో ఆ పెద్దనాగు బాము పడగయెత్తి ఆడుచు కరుణామయమగు చూపులు నాపై బరపు చున్నది. ఓ అయ్యా! నీ వెవరవు? నీవునూ ఈ యమలోకమున నొక బంటువా? ఇక్కడకూడ సూర్యుడు వెలుగునా? ఈతడు యమలోకపు సూర్యుడు కాబోలు. పూర్తిగా తన కిరణముల వెదజల్ల లేకున్నాడు” అని యామె వెర్రిమాట లాడుకొనుచున్నది.

ఆమె ఇటు నటు చూచినది. అక్కడ నాడుచున్న పామును సమీపించి బుజ్జగింపసాగినది. పాములతో ఆట నామె కలవాటేకదా! ఆ పామును చెంతకు తీసికొని కౌగిలించినది. ఆ పన్నగేంద్రము ఆమెను మెలివేసికొనిపోయినది. “ఓ నాగరాజా! నీవును శిక్షపడి ఈ యమలోకమునకు వచ్చినావా?” అని ఆమె ప్రశ్నించెను.

నాగరాజు కన్నులు: అమ్మా! నిన్ను స్పృశించిన కాలకూట విషా నందమూర్తివలే తోచుచున్నావు. సముద్రమున జనించిన హాలాహలమే నీలకంఠుని గళమునుండి యిట్లు నీ రూపు తాల్చెనేమో?

విషబాల: ఓ ఉరగాధిపా! నీపై నెవరికి కోపమువచ్చినది? నీ కీ భయంకర పాపలోకముల బాధనొందుమని ఎవరు శాపమిచ్చినారు? నీకును తాతగారున్నారా?

నాగరాజు ఫణిపాదములు: ఓ సౌందర్యగాత్రీ! శ్రీకృష్ణుని పాద రజమువలె సాక్షాత్కరించినావు. నీ దేహమున హిమశైతల్యము, దావానలోష్ఠిమ వియ్యమందుచున్నవి.

విషబాల: ఓ వాయుభక్షకా! నీ కాకలి దహించుకొనిపోవుటలేదా? నీ గృహ మెక్కడ? నీ గృహముకడ పావనోదకములుగల నదీమతల్లి పారుచున్నదా? అందు చల్లని నీరములు కడుపునిండ త్రావుచుంటివా?

నాగరాజు చుట్టలువీడి, ఆ డొంకలలో నటు నిటు ప్రాకజొచ్చెను. విషబాల లేచి కచభారము సర్దుకొని యా దిక్కునకు పోవ ఒక్కవాడి ముల్లు కసుక్కున పాదమునకు గ్రుచ్చుకొనుటచే కెవ్వున నార్చెను. తెల్లబోయి యా పాము వెనుక కమితవేగముతో వచ్చి యామె కాలు చుట్టి చుట్టి చూచెను. విషబాల నెమ్మదిగ నా కంటకము నూడబెరకుకొనెను. పాములదారి బాలలకెట్లు సరిపోవును? ఎటుచూచినను ఆమెకు దారి కనబడ లేదు. ఆ పాము నాలుగువైపుల తిరిగివచ్చినది. కాని దాని హృదయమునకుగూడ మనుష్యస్త్రీ నడచుదారి ఏమియు కానరాలేదు.

ఉస్సురనుచు విషబాలిక కూలబడినది. స్థౌలతిష్యుని అనుచరులు ఆ చుట్టునున్న దారులన్నియు ముండ్ల డొంకలతో కప్పి మరియు వెడలి పోయిరి.

అడివి బాపిరాజు రచనలు - 2

* 175 *

హిమబిందు (చారిత్రాత్మక నవల)