పుట:Himabindu by Adivi Bapiraju.pdf/178

ఈ పుట ఆమోదించబడ్డది

 చారుగుప్త సర్వస్వము సపహరించుకొనిపోయిన ఈ దుష్టులు చోర మాత్రులు గారు. ధనరాసులు దిగవిడిచి బాలికల నపహరింతురా చోరులు? వారికి ముక్తావళీదేవితో నేమి పని? ఇందేదియో రాచకార్యమున్నది. ఇది యంతయు శత్రువుల కుతంత్రము. ఔరా! ఆంధ్రరాజధాని యేమి, రాజ దుర్గముకంటెదుష్ప్రవేశ మగు వణిక్సార్వభౌముని ప్రాసాదము చొచ్చుటేమి ఎంత అరాజకమైపోయినది. శత్రువుల కాంధ్రరాజధాని యింత అలుసై పోయిన దేమి! దేశద్రోహులగు ఆంధ్రు లెవరో, ఇంటి దొంగలవలే ఇంత పని చేసిరికాని శత్రువు లెన్నిగుండెలతో ధాన్యకటకమున గాలిడగలరు?

ఆ బాలిక పరీమళజలముల ఉదయమున స్నానమాడునది, తూలికా మృదు వస్త్రములు ధరించునది, సుగంధము నలదుకొనునది, మసృణకిసలయ సదృశము లగు పర్యంకముల పరుండునది. అయ్యబల శత్రువులచే నెట్టి ఇడుమలపాలైనదో! తానేమి చేయగలడు? ఎచట వెదుకగలడు? తనకు దూరదృష్టి, దూరశ్రవణాసిద్ధులు, ఆకాశ గమనాది విద్యలు తెలియవాయెను.

ఎంతమంది నడిగినను ఇసుమంతయైన జాడ తెలియుటలేదు. ఆ బాలిక బ్రతికియుండునా? “ప్రభూ మహాశ్రమణకా! ఆమెను రక్షించుము. ఆమె క్షేమముగ నున్న చాలును. జంబూద్వీపస్థము లగు మహాచైత్యము లన్నిటికి శిల్ప సేవ గావించుకొందును.”

సువర్ణశ్రీ ఇట్టి ఆలోచనలతో ఒక్కడు ఆ మహాశ్వముపై నవలీలగ క్రోశములు, క్రోశములు గడచి ముందునకు పోవుచుండెను.

పూవు ఎన్ని యోజనముల దూరముననుండిన నుండు గాక. దాని పరీమళములు పసిపట్టి సూటిగా భృంగబాలుడు ఆ పూవుకడకు పోవును. ప్రేమికులకు ప్రియురాలి జాడను ప్రణయమధుర పరీమళములు పసిపట్టి యిచ్చును. సువర్ణునకు చోరులజాడ నెవ్వరినడిగినను దెలియరాలేదు. అయినను క్షణక్షణము ఆమె అక్కడ ఉన్నది. ఆమె ఇటు పోయినది అని ఆతనియంతరంగమున స్పష్టమున తోచుచుండెను. దివ్యదృష్టి నిచ్చును గదా ప్రేమ!

సువర్ణశ్రీ కుమారుడు గుఱ్ఱమును నందపురము (నందిగ్రామము), గిలనకేర (గార్ల), మంత్రకూటము (మంథెన) దారిని పోనిచ్చి అచ్చట గోదావరీనదిని దాటిపోయెను.

నాగులలో జాతిభేదము లెన్నియో యున్నవి. ఆర్యనాగులు నాగపూజ చేయుదురు. పన్నగులనువారు మద్రజాతి నాగులు. వారిని ఆర్యా నార్య మిశ్రజాతి అందురు, అనార్య సంపర్క మెక్కువయున్నవారిని గూఢపు లందురు. వారే గోండులు. గోండులుండు కాంతారములకు గోండువనమని పేరు.

గోండులు ఆర్యబ్రాహ్మణ ప్రభువులగు సాతవాహనులయెడ పరమ భక్తులు. దక్షిణ కోసలమునకు బడమటనుండు దండకాటవిభాగమున శబరు లుండిరి. వీరు గాంధర్వ పన్నగ మిశ్రజాతికి జెందినవారు. పన్నగవంశములవారు నాగరపధములందే నివసించుచు, ఆంధ్రసాతవాహనదేశమున శూద్రులైరి. వారు మంగలి, చాకలి, ఉప్పరి వృత్తు లవలంబించియుండిరి.

శబరులకు, గోండులకు ఎప్పుడును ప్రబలశత్రుత్వ ముండెడిది. శబరులు ఆంధ్ర చక్రవర్తులకు భయముచే లోబడియుండిరిగాని భక్తిచేగాదు. శబరులు మాయావులు. వారు మంత్రవిద్యను గంధర్వులకడ నేర్చినారు. ఆ శాబర మంత్రతంత్రములకు భయపడి గోండులు ఆర్యఋషుల నాశ్రయించి యుండిరి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 168 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)