పుట:Himabindu by Adivi Bapiraju.pdf/174

ఈ పుట ఆమోదించబడ్డది

“ఆర్యా! నేను జాగ్రత్త పడియే యుంటిని. కోటగుమ్మ మావలనే ఆతని కన్నులు కట్టి సభాభవనమున కట్టు విప్పినాము. వెడలిపోవునప్పుడు కోటగుమ్మమునకు వెలుపలనే కట్టువిప్ప ఆజ్ఞ యిచ్చినాను.”

“మంచిపని చేసితివి! అయిన ఈ రాయబారమునుగూర్చి నీ వేమందువు? హిమబిందును పట్టుకొనుట వీరి కెట్లు సాధ్యమగును?”

“నా కేమియు నమ్మకము లేదు.”

ఇంతలో శుకబాణు డచ్చటకు వచ్చెను.

సమవర్తి శుకబాణునకు సమస్తము వినిపించి వానియభిప్రాయ మడిగెను.

శుక: ఇప్పటికి పదిదినములవెనుక హిమబిందుకుమారిని చోరు లెత్తుకొని పోయినారనియు, ఆ చోరుల వెంటనే కొన్ని దళములు తరుము కొనుచు పోయెననియు వార్త వచ్చినది. ప్రతిష్ఠానమునుండి మహారాజు రెండు మూడు దినములలో వేట నెపమున బయలుదేరెను. సైన్యములు నాసిక కనియు, అటు వాతాపినగరమున కనియు బయలు దేరినవి. చక్రవర్తి మహా సైన్యములతో దంతిపురము దాటి, మహానదిని దాటి విదేహ రాజ్యము చొచ్చినాడు. మగధరాజధానిలో నున్న సైన్యములు తక్కువ కాబట్టి ఒక సైన్యము మన సైన్యములనుండి విడిపోయి ఉజ్జయిని వైపు తిరిగినది. మూల సైన్యమునే యడగించుటకు ఔఘలుడు విదర్భ సైన్యములతో, కొన్ని కళింగ సైన్యములతో మహానదికడ అడ్డగించినాడట. ఏనుగు తామరతూళ్ళను చిందరవందరచేసి కాసారము చొచ్చునటుల, దావాగ్ని కాంతారమును దహించుచు విజృంభించునటుల ఆంధ్రసైన్యములు ఆ సైన్యముల నాశనముచేసి, ముందుకు చొచ్చుకుపోయి పాటలీపుత్రము వైపుకు బోవుచున్నవి. ఇంక పదిదినములవరకు మన కోటకు భయము లేదని నిస్సంశయముగ చెప్పగలను.

వినీ: “అవును. కాని హిమబిందువిషయము....” అని వినీత మతి ఇంకను ఏమియో చెప్పబోవుచుండ, ఒక సైనికుడు లోని కేతెంచి వారికి ప్రణామమిడి “జయము! జయము! ఆ రాయబారి వెడలిపోవుచు “నేను సమవర్తి సైన్యాధ్యక్షునకు తెలిపిన యుదంతమునకు సాక్ష్యములివిగో, వీటిని వారి కందజేయుడు” అని యీ మంజూష మా కిడినాడు. ఇందేమున్నదో యచ్చటనే పరిశీలించి మరియు కొనివచ్చినాము. ఇందు ద్రోహమేమియు లేదు. అధిపతులు పరీక్షింతురుగాక” అని యా చిన్న పెట్టె వారి మ్రోల నునిచెను. వారా మందసము తెరచుటయు నందున్న భూషణముల చూచి సమవర్తి హాహాకార మొనర్చెను. నవరత్నఖచితములై మెరయు నా యాభరణములు హిమబిందు కుమారికారత్నము ధరించునవియె. వానికడ నొక మొగలియాకు పై లిఖించిన లేఖయున్నది. అది అందుకొని సమవర్తి యిట్లు చదివెను.

“శ్రీ మహారాజశ్రీలు, వీరాగ్రేసరులు, మేనబావలు నగు సమవర్తి సైన్యాధ్యక్షులకు హిమబిందు నమస్కారములు. నన్ను వీరు మా ఇంటినుండి హరించి మా అమ్మతోగూడ కొనివచ్చినారు. ఇది యే ప్రదేశమో తెలియదు. ఇందు మమ్ము బంధించినారు. మమ్ము వీరు గౌరవముగా జూచుచున్నారు, మేము ధైర్యముగా నున్నాము. కాని మమ్మేలనో వీ

అడివి బాపిరాజు రచనలు - 2

• 164 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)