పుట:Himabindu by Adivi Bapiraju.pdf/173

ఈ పుట ఆమోదించబడ్డది

“ఓరి వాచాలుడా! ఆంధ్రులలో పిరికిపందలు, రాజద్రోహులు మందునకై ననులేరు. మీరాజు చక్రవర్తియా? నే నాంధ్రరాజు నగుదునా? ఏమి యీ చాతుర్యము! కౌటిల్యుని యుక్తిని మించిపోవుచున్నది. పో! ఇంక నీ రాయబారము నాకు వలదు. ఆంధ్రులలో ఒక్కనికైన ప్రాణమున్న ఆతడుకూడ తనబాహుబలము రుచిచూపి మరియు అంతరించును. చక్రవర్తి వచ్చుచున్నాడు. మాకు వేగువచ్చినది. శుకబాణబలమే వచ్చినది. మీ సైన్యములు నామరూపములులేక నశించిపోవును. ఇప్పటి కైన నా మాళవుని, తదితరనాయకులను ఆయుధములు వదలి మా కోటలోనికి శరణార్థులై రా నిండు. మీ సైన్యములు విడిపోయి చెల్లా చెదరు కానిండు. మీ నాయకులకు ప్రాణదానము చేసెదము. లేదా ఒక్కనినైనను కొనయూపిరితోకూడ పోనీయము. ఆంధ్రసింహనాదము మీగుండె లవియజేయును. ఆంధ్ర మృగేంద్ర నిశిత నఖములు మిమ్ము వచ్చి వందరలాడును. పో! ఇదియే నీ రాయబార మున కుత్తరము. మీకు ఒకదినము గడువిచ్చినాము. ఆలోచనచేయుడు.

నే చెప్పినట్లు చేసి ప్రాణములు దక్కించుకొనుడు. కాకున్న ప్రాణము లఱచేత నిడుకొని యుద్ధమునకురండు” అని సమవర్తిమోము జేవురింప కన్ను లుజ్వలింప నుత్తరువిచ్చెను. అతనిచేయి కరవాలపు బిడిపైననే తాండవ మాడుచున్నది.

“సైన్యాధిపా! ఆగుడు, అంత్యసందేశ మున్నది. అయ్యది తమకు మనవి చేసి మరియు పోయెదను. చారుగుప్తుడను వర్తకరాజు మీకు మేన మామయట!”

“అగును.”

“సౌందర్యనిధి యగు హిమబిం దాయన కూతురట!”

“అగుచో?”

“చారుగుప్తుడు ఆంధ్రసింహాసనమున కాదిశేషువట.”

“ఏమిరా నీవాచాలత మీరు చున్నది?”

“ఆ హిమబిందుకుమారి తమకు మిక్కిలి బ్రియతమ యట!”

సమవర్తి మాటాడక తీక్షణదృష్టుల నా రాయబారిని గమనించుచు, తన గుండెలు అటుల కొట్టుకొనుచున్నవేమా యని ప్రశ్నించుకొనియెను.

“ఆర్యా! ఆ బాలిక ఇప్పుడు మాకు బంది అయినది. ఆమెను మీ దేశస్థులే ఎవరో ఎత్తుకొనివచ్చి మాకు ఒప్పగించినారు. మీ సైన్యము లీ దినమున కోట విడిచిపోవలయును. లేనిచో హిమబిందును ఒక కుష్టువానికిచ్చి వివాహము గావించెదము. రేపటికిని మీరు వదలనిచో ఆమె కొకకన్ను, ఒక చేయి నశించును. ఆమె కన్యాత్వము ఏరును అనుమానింపకుండ ఆమె ముత్తవనుగూడ ఆమెతో బాటు బంధించుకుని వచ్చినారట. ఇదియ నా రాయబారము. పనివినియెదను. నమస్కారము. మేము చెప్పిన ఆజ్ఞలు పాలింప మీ సైన్యముల కిచ్చలేనిచో మీ రొక్కరైన మా శిబిరములకు వచ్చివేసి, మా ప్రభునకు మిత్రులు కండు. ఆర్యా! నమస్కారము” అని ఆ రాయబారి వెడలిపోయెను. సమవర్తికత్తిని యొరనుండి తీసినాడు. కోపముచే వణకు దేహముతో, రౌద్రముచే దుమారము కప్పిన మనస్సుతో సమవర్తి వినీతమతి కడకు మహా వేగమున వేడలిపోయి రాయబారపుటుదంత మంతయు వాక్రుచ్చెను.

వినీతమతి ఆశ్చర్యనయనములతో సమవర్తిని కనుంగొని “ఓయీ, నే నా మాటలను ఏ మాత్రము విశ్వసింపను. అంతయు కల్ల. వారికి కోటలోని సంగతి తెలిసికొన ఊహ కలిగి వీనిని పంపినారు. అదియే నిజము.”

అడివి బాపిరాజు రచనలు - 2

• 163 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)