పుట:Himabindu by Adivi Bapiraju.pdf/167

ఈ పుట ఆమోదించబడ్డది

32. ఆంధ్ర బ్రహ్మర్షి

స్థౌలతిష్యులవారు చంద్రస్వామి విషయమంతయు ఎప్పటికప్పుడు తెలుసుకొనుచు నేయున్నారు. చంద్రస్వామి బౌద్ధశ్రమణకులకడ బౌద్ధ ధర్మములు నేర్చుకొనుచు, ఆర్షధర్మము విడనాడకయే మెలగుచుండె నని తెలిసికొనెను.

స్థౌలతిష్యుడు ప్రతిష్ఠానపుర ప్రాంతాశ్రమము చేరుకున్నను ప్రియశిష్యుడగు చంద్రస్వామిని గూర్చియే యాలోచించుకొనుచుండెను.

స్థౌలతిష్యుడు పదిసంవత్సరములలో ఆర్యావర్తము, దక్షిణాపథము, సువర్ణద్వీపము, గాంధార, బాహ్లిక, తురష్క పారశీకాది దేశములన్నియు సంచారము చేసి, కాశ్యపుల, కౌండిన్యుల, పారాశర్యుల ఓడించి వారినందరిని అద్వైతవాదుల నొనరించి, ఆశ్రమముల స్థాపన మొనరించి, పండితోత్తముల కులపతుల నొనర్చెను.

చంద్రస్వామి బౌద్ధ గ్రంథముల కంఠపాఠమొనర్చెను గాని, హృదయస్థము గావించుకొనలేదు. బౌద్ధధర్మముల నిరసింపవలయు నని ఆతని పూనిక. అమృతపాదార్హతుల ఆశ్రమము ప్రవేశించి బుద్ధధర్మతత్వము నెరుంగ జొచ్చిననాటినుండియు ఆతని దృష్టి మారిపోయెను.

“పండితులవారూ! మీగురు వగు స్థౌలతిష్యమహర్షి తమధర్మము సత్య మనియు పరధర్మము భయావహ మనియు ఎంచుటచేతనే పరధర్మావలంబుల జయించి తనధర్మము నెలకొల్పనెంచెను.”

“స్వామీ! ఒక క్రూరమృగము, గోవు మొదలగు సాధుమృగముల చంపబోవుచుండ మనము చూచితిమి. ఆ క్రూరమృగమును మనము నిర్జింపవలయునా, వలదా?”

“మీరు క్రూరమృగమును నిర్జింప నవసరము లేదు. మనుష్యుడు సంపూర్ణముగ అష్టమార్గావలంబియైనచో ఆతని ప్రేమ క్రూరమృగములోని క్రూరత్వమును నాశనము చేయగలదు.”

“అందరు అష్టమార్గావలంబన చేయగలరా స్వామీ?”

“ఎందుకు చేయలేరు? తక్కిన మ్లేచ్ఛదేశములకన్ననిచట సంస్కారము, జ్ఞానము, దయాసత్యశౌచాదులు ఎక్కువగా నున్నవి కాదా?”

“జంబూద్వీపమున ఇంకను ఋషులసంతతు లున్నవికదా?”

“ఇతర ద్వీపములవారు ఎవరిసంతతి? ఆస్తికులందరును భగవంతుని సంతతియేకదా?”

“అందు భగవంతుని ముఖమునుండి జనించినవారు బ్రాహ్మణులు!”

“మ్లేచ్ఛులు స్వేదమునుండియో, పాదనఖములనుండియో జనించిరి కాబోలు నేమి?"

“కావచ్చును.”

“కావచ్చునా పండితులవారూ? ఒకసారి బ్రహ్మముఖమునుండి ఇంతమందియని లెక్కప్రకారము బ్రహ్మర్షులు జన్మించినారు కాబోలు! వారు ఇతర ధర్మములపాలయినచో పాదజులయి పోవుదురు కాబోలు? శుద్ధ బ్రహ్మము రూప, నామ, గుణాతీతముకదా, ఉపనిషన్మత ప్రకారము? అట్టిది బ్రహ్మయేమి, విష్ణువేమి? వీ రెటుల వచ్చిరి? కావున

అడివి బాపిరాజు రచనలు - 2

• 157 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)