పుట:Himabindu by Adivi Bapiraju.pdf/165

ఈ పుట ఆమోదించబడ్డది

భటులు నొకమంత్రియు నుండిరి. సువర్ణశ్రీ అమితవేగమున సింహద్వారము వెంబడి భవనకుడ్యములచుట్టి, యెచ్చటనుండి చోరులు గోడ దాటిరో అచ్చటకు వచ్చెను. అచ్చట జనములు ప్రోవైయుండిరి. ఆతడు నెమ్మదిగా అడుగులజాడ తీయుచున్న ఒక వర్తకశ్రేష్ఠుని, ఒక చమూపతిని సమీపించి వారిరువురు అనుకొన్న మాటల వినియెను.

చమూ: ఈ జాడలు కృష్ణ ఒడ్డువరకు నున్నవట.

వర్తక: అంచె గుర్రములమీద హుటాహుటిగా పోయి యుందురు.

చమూ: మహామాయాధురంధరు లగు వేగువాండ్రు జాడ నరయుటకై సాగిపోయినారు. చారుగుప్తుని అశ్వశాలలో ప్రసిద్ధాశ్వముల నెక్కి దళవాయులు కొందరు వారిని వెంబడించినారు.


31. చంద్రస్వామి

చంద్రస్వామి స్వచ్ఛహృదయము గల వ్యాఘ్రదేశాంధ్ర బ్రాహ్మణుడు. త్రయీపాఠి. దార్శనికుడు. వేదాంతి.

చంద్రస్వామి హృదయమును స్థౌలతిష్యమహర్షి చూరగొన్నాడు. ఆ మహర్షి మహత్తర సంకల్పము చంద్రస్వామిని ఉత్తేజితునొనరించి, స్థౌలతిష్యుని అనుచరులలో నాయకుని చేసినది. స్థౌలతిష్యునకు చంద్రస్వామి గుణగణములు తెలియును. ఆతని మనస్సు మెత్తనయనియు, రహస్యములు దాచుకోలేని దనియు ఆయన గ్రహించినారు. కావున చంద్రస్వామి పండితులను స్థౌలతిష్యులు అత్యంత రహస్యాలోచనలకు రానిచ్చువారు కారు.

చంద్రస్వామి స్థౌలతిష్యమహర్షి మహాత్మ్య మెరుగును. జంబూద్వీపమున గల బ్రాహ్మణులు ఆ మహర్షిని శంకరావతారమనియే ఎంచుకొనుచుండిరి. ఆయన పేరు వివిధ ఋష్యాశ్రమముల వివిధనగరగ్రామ బ్రాహ్మణగృహముల అత్యంత భక్తితో స్మరింప బడునది. స్థౌలతిష్యుని శిష్యులు దేశదేశముల మహోద్ధండపండితులై, వివిధవేదాశ్రమముల కులపతులై, ఆ మహర్షి బోధనల, ప్రచారముచేయుచుండిరి. ఒక్కొక్క అర్హతుని ఒక్కొక్క మహాపండితుడు తారసిల్లి బౌద్ధధర్మము నిరసింపుచు, వాదనకు వారిని పురికొల్పి నిరుత్తరులను చేయుచుండెను.

చంద్రస్వామి స్థౌలతిష్యమహర్షి ఆజ్ఞలు గాఢాభిమానమున శ్రద్ధతో నిర్వహించు చుండెను.

చంద్రస్వామిని అనార్షవాదులతో వాదనకై మాత్రము స్థౌలతిష్యుడు నియమించెను. అతని అనుమానించి ఆంధ్రాపసర్పులు మహామంత్రికి నివేదించుటయు, వారు చక్రవర్తికి తెలిపిరి, చక్రవర్తియు చంద్రస్వామిని బంధించి, అతనిపై నేర మారోపించి శిక్షవిధింప వలయునని ముదల నిచ్చిరి.

చంద్రస్వామి ద్రోహి యని మనచక్రవర్తికి నమ్మకము కుదరలేదు. చక్రవర్తి అమృతపాదులకడకు పోయి తమ యనుమానములు తెలిపినారు. అప్పుడా అర్హతలు చంద్రస్వామి చరిత్రనంతయు ఆకళించి ఆతడు నేరస్థుడు కాడనియు చక్రవర్తి అతనిశిక్షను రద్దుచేయించవలయు ననియు దెలిపిరి. ప్రాడ్వివాకులు శిక్ష విధించుటయు, అమృతపాదులు వచ్చి చక్రవర్తి ఆజ్ఞాపత్రముచూపి చంద్రస్వామిని తీసికొనిపోయినారు.

అడివి బాపిరాజు రచనలు - 2

. 155.

హిమబిందు (చారిత్రాత్మక నవల)