పుట:Himabindu by Adivi Bapiraju.pdf/161

ఈ పుట ఆమోదించబడ్డది

విషబాలమాటలు వినగానే స్థౌలతిష్యులు ప్రళయకాలరుద్రునిభంగి ఒక్కుమ్మడి లేచి జేవురించిన కనులతో క్రోధకంపితగాత్రుడై కాలా దేశమువలె దీర్ఘ మగు బాహువు చాచి,

“ఏమంటివి ఉత్పథచారిణీ!” అని లోకము లదరునట్లు కేక వైచినాడు.

“తాతగారూ! నన్ను ప్రయోగింపకుడు” అనుచు భయమును, దిరస్కారమును దోప విషబాల జాలిగొలుపుచు బలికినది.

“నేను ప్రయోగించెదను నీవు నాశనముచేయుదువు.”

“నన్ను నాశనముచేయుడు తాతగారూ!"

“మాటలాడకుము” ఆ స్థౌలతిష్యునికేక మిన్నుముట్టెను.

విషకన్య నిర్భయముగ నిలిచి, దండతాడిత భుజంగమువలె తాతగారి కేకకు మరియు నాగ్రహము నంది,

“తాతయ్యగారూ, నేనును మీవంటి మనుష్యబాలికను. నాకును కోపము, తాపము, ప్రేమ, జాలి, అన్నియు ఉన్నవి” అని ఆమె స్ఫుటాక్షరములుగా పలికినది.

కాపాలిక, గగనియు, అగస్తియు, కాశ్యపియు ఆ బాలికదగ్గరకు పరుగిడి వచ్చి“తల్లీ, తాతగారి ఆజ్ఞను పరిపాలించుము. ఈ కార్యములు మనుష్యు లొనరించునవి కావు. దైవకృతములు. దైవప్రీతికరములు. మనము వీని నడ్డ తగదు” అనిరి.

విషకన్యక వారిని విదలించుకొని పద్మపీఠమునుండి దిగి, గబగబ పరుగిడిపోయి “యీ సర్వమును సృష్టించిన ఓ భగవంతుడా, ఓ మహేశ్వరుడా, నీ ప్రీతికొరకా నేను మనుష్యులను చంపవలసినది! నీవు పుట్టించిన మనుష్యులను నీవే చంపి తిందువా? ఈ యకార్యమునకు సాధనమగుటకు నే నేమి జడమునా? నేను ప్రేమించగలను, ద్వేషించగలను. నావలచిన పురుషుని నేను స్పృశింపగూడదా! స్త్రీజన సామాన్యమగు యీ సుఖమునకు నేను దగనా! ప్రేమించిన పురుషుడు నన్ను ముట్టుకొన నొల్లను. నాపై దురాక్రమణము సేయువాడు హతుడైన నగుగాక. ఎవరో శ్రీకృష్ణ శాతవాహనుని చంపుటకు నన్ను ప్రయోగముచేయుచున్నారట. ఆతడు నన్ను ముట్టుకొనుటకు నాకు ఇష్టము అగునో, యిష్టముకాదో? నాకిష్టమైనను అతడు నన్ను ముట్టుకొని చచ్చిపోవును గదా! ఆతని నేను వలతునేని నీవే యాతనికి రక్షకుడవు గమ్ము.”

ఆమె కన్నుల నీరు నీలి కలువపూవులలో నిలచిన హిమబిందువులైనవి.

“నీవు ఫాలలోచనుడవు. నీవు నీ ఫాలలోచనముతో దుర్మార్గులను భస్మము చేయుదువట. అబలయగు బాలికచే మనుష్యులను చంపుట కంటె నీకు మార్గమేలేదా? నాగొంతు గోసినకాని యీ దారుణకర్మము నెరవేరదా? ఉమాపతీ! నాకు బతిభిక్ష పెట్టుము. నన్ను పాషాణమునైన చేయుము లేదా నాస్త్రీత్వమును సార్థక మొనర్పుము. నాకు భర్తను, బిడ్డలను అనుగ్రహింపుము.”

విషకన్యక వెక్కి వెక్కి ఏడ్చినది. స్థౌలతిష్యుడు మారుమాటాడక గగని మొదలగు వారిని వెనుకకుపొండని సైగ నొనర్చి విగ్రహము మ్రోల బడియున్న విషకన్యకపై మంత్రజలములు చల్లి “శ్రీకృష్ణశాతవాహన నాశనమునకై యీ బాలికను ప్రయోగించు చున్నాను” అనుచు అగ్ని హోత్రమున సమిధలు, నేయి హోమమొనర్చెను.

మహేశ్వర విగ్రహ సమీపమం దున్న దీపములన్నియు ఒక్కసారి ఆరిపోయినవి. ఆరిపోయిన దీపపు కొడులనుండి పొగలొక్కసారిగా పైకెగసినవి. స్థౌలతిష్యుడు రిచ్చవడి

అడివి బాపిరాజు రచనలు - 2

• 151 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)