పుట:Himabindu by Adivi Bapiraju.pdf/152

ఈ పుట ఆమోదించబడ్డది

26. ఉజ్జయిని

ఉజ్జయినీనగరము భారతభూమియం దున్న సప్తమహాక్షేత్రములలో నొకటి. ఆ మహానగరము అభయబాహువు శాతవాహనమహారాజు కాలములోనే ఆంధ్రులచే జయింప బడినది.

ఆ పురముచుట్టు నున్న కోటగోడలు శత్రువులకు అభేద్యములు. కందకములు అగాధములు. పురమధ్యమున మహారాజు నివసించు దుర్గమున్నది. శత్రువులు నగరము ప్రవేశించినచో సైన్యములు దుర్గములోనికిబోయి రక్షించు కొనవచ్చును. నగర కుడ్యముల కన్న దుర్గకుడ్యములు మరియు బలమైనవి. ఉజ్జయినికోట పట్టుకొనవలయునన్న రెండే మార్గములున్నవి. ఒకటి: నగరములో తిండిలేకపోవుట, రెండు: నగరరక్షక సైన్యమునకు ధైర్యము నశించుట.

సమదర్శిశాతవాహనుడు అన్నివిధముల తండ్రిపోలిక. ప్రియదర్శి అవక్రవిక్రమము సంపూర్ణముగ నాతని నాశ్రయించినది. తనతండ్రి జయించిన మాళవమును తాను రక్షింపజాలకుండుట ఎట్లు?

సమదర్శి యువకుడైనను సేనానాయకులలో ఉత్తముడని వినీతమతికి దృఢవిశ్వాస మున్నది. ఆతడు ప్రియదర్శికుమారుడు. ఆ సర్వ సైన్యాధ్యక్షునికడ ముఖపతిగా, చమూపతిగా, సేనాపతిగా పని చేసినాడు. ఉత్తమయుద్ధ నీతి చూపుచున్నాడు. ఆయినను ప్రియదర్శిశక్తి పూర్ణముగ, నీతనియందు ప్రదర్శితమౌనాయని యాలోచించుకొనెను. అట్టి ప్రియనాయకునిపుత్రునిపై సర్వభారము నుంచి తానుతోడుపడుట ధర్మమనే యాత డనుకొనెను.

శాత్రవపరివేష్టితమై ఉజ్జయినీనగరము మహాసముద్రమధ్యమున నున్న దీవివలె నున్నది. ఉజ్జయినిని ముట్టడించిన మాళవ, మగధ, పుళింద, విదేహ, శక, సౌరాష్ట్ర సైన్యములు ఎటుచూచినను గోరుతములు గోరుతములు వ్యాపించియుండెను.

కోటను పడగొట్టుటకు ఒక్కొక్కనాడు ఒక్కొక్క సైన్యము ప్రయత్నించుచుండెను. ఆ ప్రయత్నము విఫలముకాగానే యా సైన్యము వెనుకకుతగ్గి, దూరముగనున్న గుడారముల లోనికి పోవుచుండెను

అప్పుడప్పుడు ఎనిమిదివైపులను ఎనిమిది సైన్యములును కుడ్యములను తాకుచుండెను. ఆ దినము పోరు మహాఘోరమైపోయి ఎన్నివేల మందియో చనిపోవు చుండిరి. గోడల పై, బురుజులపై, గోపురద్వారములపై యుద్ధ యంత్రములు, ఏనుగులు మాఱొడ్డుచుండెను.

మాళవ సైన్యముల నెందరు హతమారుచున్నను ఆ సైన్యముల కంతులేదు. కాని కోట రక్షించుచున్న కొలదిమంది ఆంధ్రులు భయంకర యుద్ధము చేయుచుండిరి. అట్టి సమయముల సమదర్శి సమవర్తియే. ఆతని నాయకత్వము అజేయము. అందరికి అన్నిరూపులై, ఒక్కసారిగా అని చోట్లను కనపడుచు అతడు చేయు యుద్ధమును దేవతలేవచ్చి చూచుచుండిరి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 142 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)