పుట:Himabindu by Adivi Bapiraju.pdf/107

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రోవుచేయగలను. నా పెదతాతగారి మనుమడగు కళింగాధిపతి ఆంధ్రరాజునకు స్నేహితుడననుకొని సామంతుడై యున్నాడు. ఔఘలరాజకుమారుడు విదేహముననున్న సర్వసైన్యముల నవలీలగ మనపక్షమునకు త్రిప్పివేయగలడు. ఈ యుభయపక్షముల బడుచువాండ్రందరు మాకు బాసటగా నున్నారు. ఆంధ్రభాను డస్తమించు సమయ మాసన్నమైనది. భారతభూమి యందలి యువజనమంతయు మిమ్ము నాయకునిగా వరించుచున్నది. ఆంధ్రులన మీ కేపాటి? అటు విదేహమున నౌఘలుడు, యిటు కళింగమున నేను రాజతంత్రము వశీకరించుకొని మిమ్ము భరతవరచక్రవర్తి నొనర్తుము. వేదధర్మస్వరూరూపులగు మీరు మగధసామ్రాజ్యమునకు తొల్లింటివైభవము సమకూర్చి జగద్రక్షకులు కాగలరు.

సుశర్మ: మంచిది. స్థౌలతిష్యుల యత్న మేమైనదో చెప్పవైతివి. మనము కేవలము శౌర్యమునే ఆశ్రయించుటకంటే ముందుగా ఈ భేదమార్గముల నరయుట మంచిది. మీ రింక విశ్రమింపుడు. నేటి రేయి మా సేనాపతులతో, అమాత్యులతో సంప్రదింతుము. ఆ వేళకు మీరుగూడ వచ్చి కార్యనిశ్చయము చేయవచ్చును.

మరల దర్శనము చేయుదునని ఆతడు పనివెను. సుశర్మ అభ్యంతర మందిరములకు బోయెను. అశోకచక్రవర్తి కట్టించిన యా యద్వితీయ సౌధ పంక్తి, ఆ మందిరములు, ఆ భవనములు ఆ విభవము దేవతాసార్వభౌమునకు గూడ దుర్లభములు. సుశర్మ యట్లు ప్రతీహారిణులు దారిచూప నొక భవనమున ప్రవేశించెను.

7. ఆనందమహారాజ్ఞిదేవి

నందమహారాజ్ఞి ఐక్ష్వాకుల ఆడుబడుచు. వారి రాజధాని ధనదుపురము. ఐక్ష్వాకు డగు ఈశానదత్తమహారాజు శాతవాహనులకు ముఖ్య సామంతుడుగ, మహాసేనాపతిగ నుండి అభయబాహుసార్వభౌమునికి సర్వవిధముల చేదోడువాదోడుగ నుండెను. తన యనుగుగూతు నానంద దేవిని యువరా జగు శ్రీముఖుని కిచ్చుట యతని తపఃఫలం బయ్యెను. ఆనందదేవి కాపురమునకు వచ్చిన రెండవయేటనే శ్రీకృష్ణశాతవాహనుడు జన్మించెను. మరల నామెకు సంతు అయిదేడులవరకు కలుగలేదు.

శ్రీముఖునకు ఆనందదేవి యన గౌరవము, గాఢప్రేమయును. ఆనందమహారాణి గర్వ మిసుమంతయు ఎరుగదు. రాజతంత్రములను సునిశితబుద్ధితో విచారణ చేయగలదు. భర్తను, బిడ్డలను హృదయమార ప్రేమించు ఉత్తమ గృహిణి. ఆంధ్రమహా సామ్రాజ్యమునకు చక్రవర్తిని అయ్యు నిరాడంబరమై, ఆస్తికురాలై ప్రజలనందరను దన కన్నబిడ్డలుగ చూచు రాజ్ఞిమాతయైనది.

ఇంతలో అంతఃపురముల నాడుకొను మంజుశ్రీ మాయమైనాడు. ఐదేండ్లబాలుడు. మాటలునేర్చి తనవారు, పరులు అని గురు తెరిగినవాడు. విద్యాభ్యాస మైనప్పటినుండియు అష్టాధ్యాయినే ప్రారంభించినవాడు. ఎటుల మాయమయ్యెను?

అన్నగారగు శ్రీకృష్ణుడు ధీకుశలుడు, రాజ్యతంత్రజ్ఞుడు అతిరధుడు. శత్రువులయెడ దాక్షిణ్యమిసుమంతయు కనబరచువాడు కాడు. ఆ యన్నకు దమ్మునకు గుణవైరుధ్య మెంతేని గలదు. ఆ బాలుడు నీచ సేవకునైన కోపపడి యెరుగడు. సార్వభౌమ శుద్ధాంత మహామందిరములలో పరిచారికగాని, కంచుకిగాని... దౌవారికుడుగాని, ప్రతీహారిగాని,

అడివి బాపిరాజు రచనలు - 2

• 97 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)