పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/84

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

బ్రాహ్మణ వేషధారియగు మదనసింగును గుర్తింపలేక భయకంపితుఁడయి యుండ మదనసింగు కోపోద్దీపితుడై యామహారాష్ట్రాధముని బండిలోనుండియీడ్చి నేలబడవైచెను. ఆనందదాసును శంకరుండును ఖడ్గపాణియైయున్న యోగిని గూడజూచిబెదరి ధైర్యమునఁ దమకుఁ దీసిపోవని బండివానితో గలిసి వెనుకకు దిరిగిచూడక పరుగిడిరి. మదనసింగు మొదట బ్రాహ్మణుని ప్రాణము గాపాడఁదలఁచెనుగాని దురాత్ముఁడయిన వసంతభట్టు ఖడ్గము దనపై విసరినందునను, యోగి, జయకాశి యని కేక వైచినందునను మదనసిం గాదెబ్బతప్పించుకొని తన ఖడ్గముతో బ్రాహ్మణాధముని నొక్కయేటున సంహరించెను. తరువాత నర్ధరాత్రమున నీచులను విశ్వసించి రాగూడనిస్థలమునకు వచ్చినందుకు లక్ష్మణ సింగును యోగియు మదనసింగును మృదువుగా మందలించి యారాత్రి యాతని నింటికి జనవలదని మఠమునకు వెంటబెట్టుకొని పోయి యితనికి సకలోపచారములఁ జేసిరి. తనప్రాణము రక్షించిన యా బ్రాహ్మణుఁడెవ్వఁడో లక్ష్మణసింగు తెలియగోరెను. కాని వారుభయులు రేపుదర్బారున మావిషయమై మీరెఱుంగ గలరు గాన మమ్మేమియు నేఁడడుగ వలదని ప్రత్ర్యుత్తరమొసగ లక్ష్మణసింగు తనకృతజ్ఞతా సూచకముగ రత్నపుపిడి గల తన కత్తిని మదనసింగునకు బహుమానముగ నొసగి యారాత్రియటఁ బవ్వళించెను. చిదానందయోగి మదనసింగును వెంటబెట్టుకొని యవశిష్టమగు కార్యమును సమాప్తమునొందజేయుటకు మరల బ్రయాణమై పోవుచు లక్ష్మణసింగుతో మీరు తెల్లవారిన తరువాత మా నిమిత్తము వేచియుండక మీ గృహమునకు కరుగవచ్చును. మాసేవకు లీలోపల మీకుఁ గావలసిన యుపచారములు చేయుదురు. అని సెలవుదీసికొని సాగిపోయెను.